ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధి పై
నంతై తోయదమండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

Nike Sneakers

రవిబింబంబుపమింప బాత్రమగు చ్చత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
చవి మత్కంకణమై కటిస్థలి నుదుంచద్వస్త్రమై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్నిండుచోన్ .

శుక్రాచార్యుని మాటవినక, బలిచక్రవర్తి వటువురూపంలో వచ్చిన ఆ శ్రీమహా విష్ణువుకు మూడడుగులనేల దానం యిచ్చాడు. ఆ దానఫలంతో వామనుడు, త్రివిక్రముడై యేవిధంగా విజ్రుంభించాడో వర్ణించి చెప్పిన పద్యాలు యివి.

సన్నివేశానికి తగినట్లు అల్లిన పదముల అల్లిక పోతనామాత్యుని వైరుధ్యమైన శైలికి ప్రతీక.

ఇంతగావున్న వటువు అంతఅయినాడు. అనగా కొంచెంపెరిగాడు. మళ్ళీ అంత అయినాడు. ఆకాశమార్గాన అంతవాడుగా కనిపించాడు. ఆ తరువాత మేఘమండలం దగ్గరగా వచ్చాడు. ఆపై కాంతివలయాన్ని దాటి, చంద్రుని దాటిపోయి, ధ్రువనక్షత్ర మండలాన్ని దాటిపోయి, మహాలోకాన్ని దాటి, బ్రహ్మస్థానమైన సత్యలోకాన్ని కూడా మించిపోయి, బ్రహ్మాండాన్ని అంతా ఆక్రమించునట్లు పెరిగిపోయినాడు.

ఒక్కొక్కమాట, ఒక్కొక్క గంతువేసి, వామనుని వున్నతశిఖరాలలోనికి తీసుకెళ్ళిన పదప్రయోగం అనిర్వచనీయమైన ఆనందాన్నిస్తుంది, చదువుతుంటే. ' రవిగాంచనిది కవిగాంచును ' అన్న ఆర్యోక్తి యిక్కడ అన్నివిధాలా పోతన మనోచక్షుదర్శనా ప్రాభవానికి సరిగ్గా సరిపోతుంది. ' ఇంతింతై, తానింతై, అంతై, అల్లన్తై, ఆపై అంతై ' అనే పదప్రయోగాలు ఆరోహణాక్రమాన్ని సూచిస్తూ, వామనుడు పెరిగిపోయిన విధానం కళ్ళకుకట్టినట్లు చూపింపబడింది.

ఆకాశవీది, మేఘమండలం, కాంతిమండలం, ఆపై ధ్రువమండలం, మహర్లోకం, సత్యలోకం, ఆ పై విష్ణుస్థానం. సామాన్య మానవులకు అగోచరమైన లోకాల ఆరోహణాక్రమాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించిన ద్రష్ట, పోతన. ఆయనకు యీరచనలో రామభద్రుని సహకారం, అడుగడుగునా విదితం అవుతుంది. లేకుంటే ఖగోళరహస్యాలు ఆయనకు అవగతమెట్లగుతవి ?

ఇక రెండో పద్యంలో వామనునికి, త్రివిక్రమావతారంలో, ఈ సహజసిద్ధ సూర్యమండలం యెలా ఆభరణాలు సమకూర్చింది చెబుతున్నారు పోతన. ఒక స్థాయిలో విక్రమించిన త్రివిక్రమునికి, సూర్యమండలమే ఒక గొడుగుగా భాసిల్లింది. అదే సూర్యమండలం వామనుడు ఇంకొద్దిగా పైకివెళ్ళగానే, తలమీద రత్నంగా కనబడసాగింది. ఎత్తు పెరుగుతున్న కొద్దీ, ఆ సూర్యమండల పరిమాణం తగ్గడం సహజమేకదా !

ఇంకొద్దిసేపటికి, అదే సూర్యమండలం వామనుని చెవిపోగులాగా ద్యోతకమయినది. చూస్తూ వుండగానే, కంఠాభరణం గా మారిపోయింది అదే సూర్య మండలం. ఆ పై త్రివిక్రముడు అధిగమిస్తున్నకొద్దీ, సూర్యబింబం ఆయనకు దండపట్టీగా , ముంజేతికంకణంగా, మొలకు కట్టుకునే పట్టుబట్టగా, కాలి కడియంగా చివరకు స్వామి పాదపీఠంగా మారిపోయింది.

ఓహ్ ! యెంత సాపేక్షంగా వున్నది ఈ వర్ణన. పోతనామాత్యులు యెక్కడ నేర్చుకుని యీ వర్ణన చేశాడనుకుందాం. ఆయనకు, సాపేక్షసిద్ధాంతం కనిబెట్టాడని చెబుతున్న అయిన్శ్తీనుకు యే విధమైన సంబంధం లేదు కదా ! కేవలం ఆ చదువులతల్లి కటాక్షం, మనోనేత్రాలు ప్రసాదించిన శ్రీ రామచంద్రుని కరుణ. మన పుణ్యం. సూర్యుని ఉపమానంగా పెట్టుకుని వామనుని త్రివిక్రమావతారం మన కన్నులకు కట్టవలెననే ఆలోచన, నభూతో న భవిష్యతి.

చీకట్లను తొలగించేవాడు సూర్యుడు. ఇక్కడ జ్ఞానచక్షువులు తెరిపించి ముల్లోకాలకూ సందేశం యిచ్చినవాడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు.

ఇంతింతై, వటుడింతై, అనే పద్య యెత్తుగడ, మన తెలుగు ప్రజానీకానికి యిప్పటికీ, యెప్పటికీ నాలుకపై వుండే మణిరత్నం. ఎవరైనా తమ కండ్ల ముందే త్వరితంగా అభివృద్ధిలోనికి వస్తుంటే, అప్రయత్నంగా ఈ పద్యపాదంతోనే వారిని మెచ్చుకోవడం మన అందరికీ, అనుభవైకవేద్యమేకదా !

జై శ్రీమన్నారాయణ

Search LAtelugu