ద్రౌపది అసమాన సౌందర్య రాశి. ఒక మహా పతివ్రత. భారతములోని మిగతా స్థ్రీ పాత్రలన్నింటిలోనూ ఆమెది ఒక విలక్షణమైన పాత్ర‌. పంచకన్యలలోనూ, ఆరుగురు మహా‌పతివ్రతలలోనూ ఆమె పేరు ఉంది.‌ కానీ ఒక సందేహము: ఒకే భర్త ఉన్న స్థ్రీ పతివ్రత అంటే ఒప్పుకోవచ్చు కానీ ఈమెకు ఐదుగురు భర్తలున్నారు కదా, అలాంటప్పుడు ఆమెను ఎలా పతివ్రతగా పరిగణించవచ్చు. దీనికి‌ మన ఋషులిచ్చిన వివరాలనొకసారి పరిశీలించాలి.

Adidas Adilette Slides

పూర్వము ఇంద్రుడు ఐదు రూపాలుగా పంచపాండవులుగా జన్మించినారు. ఇంద్రుని భార్య శచీదేవి. ఈమె ద్రౌపదిగా జన్మించింది. వీరందరూ స్థ్రీమూర్తుల గర్భములోనుండీ జన్మించలేదు. అందరూ అయోనిజులే. కుంతిమాద్రులకు ఒక మంత్ర ప్రభావముగా పంచపాండవులు జన్మించినారు. ద్రౌపది యజ్ఙ కుండమునుండీ జన్మించింది. వీరు ఎందుకిలా జన్మించాల్సి వచ్చిందో అసలు కథను తెలుసుకోవాలి కదా!

త్వష్ట ప్రజాపతి కుమారుడైన త్రిశిరుడిని ఇంద్రుడు సంహరించాడు. ఆయనకు బ్రహ్మహత్యా పాతకము సంక్రమించి స్వర్గలోకాధిపత్యాన్ని కోల్పోయాడు. అందుకు బృహస్పతి సలహా మేరకు తీవ్రమైన తపస్సు చేయడానికి ముందు తన పంచప్రాణాలలో నాలుగింటిని యముడు, వాయువు, అశ్వనీదేవతల వద్ద దాచాడు. దూర్వాస మహర్షి అనుగ్రహించిన మంత్రమహిమతో పాండురాజు భార్యలైన కుంతి, మాద్రి పంచపాండవులకు తల్లులయారు.

పంచపాడవులు ఐదుగురూ కలిస్తేనే ఇంద్రుడౌతాడు. ఇంద్రుడు తపస్సుచేస్తున్నపుడు అసురుల బాధ‌పడలేక అగ్నిదేవుని నీడలో తలదాచుకున్నది. ఇంద్రుడే ఐదు రూపాలలో జన్మించినాడని తెలుసుకుని తాను యజ్ఙ కుండమునుండీ జన్మించింది. ఐదు రూపాలు ఇంద్రుడే కనుక, శచీదేవే ద్రౌపది కనుక కచ్చితముగా పతివ్రతే. ఈ కథ మార్కండేయ పురాణములో ఉంది. కనుక ఆమె "పంచభర్తృక " కాదు.

కురుక్షేత్ర యుద్దములో తన ఉప పాండవులను అశ్వర్థామ చంపగా చాలా వివశురాలవుతుంది. తన వివాహము పైన ఉన్న ధర్మశంఖలను వ్యాసుడు, శ్రీకృష్ణుడు తీర్చారు. వీరేమి చెప్పారంటే ~ శచీదేవి పూర్వ జన్మలో మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన. ఆ తరువాత జన్మలో కాశీ రాజు కూతురుగా అనామిక గా పుట్ఘి ఘోరమైన తపస్సు చేస్తే పరమశివుడు వరా‌న్ని కోరమంటే పతి కావాలన్న పదాన్ని ఐదు సార్లు పలికింది. సరే అన్న శివుడు, నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్దము కాకుండా ఆమెకు శుశ్రూషాభావము, కన్యాత్వము, సౌభాగ్యమును అనుగ్రహించాడు.

ఆ తరువాత యజ్ఙంచేస్తున్న ద్రుపదునికి యజ్ఙకుండములో జన్మించింది. ఆమెను పార్థుడికివ్వాలని ద్రుపదుడు అనుకున్నాడు. కానీ పాండవులు మరణించారని తెలుసుకుని ఆమెకు స్వయంవరాన్ని ప్రకటించాడు. బ్రాహ్మణవేషదారిగా ఉన్న పార్థుడు ఆమెను స్వీకరించి కుంతివద్దకు తీసుకువెళ్ళగా, కుంతి అనాలోచితముగా మీరు గెలుచుకోచ్చిన దాన్ని మీ ఐదుగురూ పంచుకోండని అన్నందుకు వారు ఐదుగురూ భార్యగా స్వీకరించినారు. అయినా ద్రుపదునికి ఉన్న సందేహాన్ని వ్యాసుడు తీర్చి ద్రౌపది కారణజన్మురాలనీ ఇలా జరగాలనే అగ్ని గుండమునుండీ ఉధ్భవించిందని‌ ద్రుపదునికి‌ సంశయ ‌నివృత్తి చేసాడు.

పాండవులు వారిమధ్య ఒక ఒప్పందము ప్రకారమూ ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరూ ఒక‌ సంవత్సరము గడపాలని అనుకున్నా, ఒక సందర్భములో అర్జునుడు ఉల్లంఘించినందుకు అర్జునుడు ఏడాదిపాటూ తీర్థయాత్రలకు వెళ్ళి మూడు వివాహాలు చేసుకున్నాడు.

మాయాద్యూతములో గెలిచి పాండవులనూ ద్రౌపదినీ బానిసలుగా చేసుకున్న ధుర్యోధనుడు ‌‌నిండు సభలో ఏకవస్త్ర‌ అయిన ద్రౌపదిని దుశ్శాసనుడు జుట్టు పట్టుకుచ్చినపుడు తన తొడమీద కూర్చోమని సైగ చేసాడు ధుర్యోధనుడు. ఆమెను వివస్త్రను చేయబూనినాడు. మరోసారి జూదమాడి ఓడిపోయి అరణ్యవాసాన్ని చేయవలసి‌ వచ్చింది పాండవులకు తమ భార్యతో సహా. ఆ కాలములో సైంధవుడు ఆమెను అపహరించడానికి ప్రయత్నము జరిగింది. విరాటపురములో కీచకుడు బలవంతముగా అనుభవించాలనుకున్నపుడు భీముడు వాణ్ణి వధించ వలసి వచ్చింది.

అజ్ఞాతవాసానంతరమూ రాయబారాలు, సంధి ప్రయత్నాలు జరుగుతున్నపుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్దము జరిగి తనను అవమానించినవారిని తన భర్తలు కౌరవులను నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరింది. ఆ కోరిక నెరవేరే క్రమములో తన పుత్రులైన ఉప పాండవులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది.‌

భార్యగా భర్తల ఆజ్ఞానుసారమూ అష్టకష్టాలను‌ అనుభవించింది. క్షత్రియకాంతగా తాననుభవించిన అవమానాలకు, అవహేళలకు ప్రతీకారము జరిగే వరకూ తాను విశ్రమించలేదు. భర్తలను కూడా విశ్రమించనివ్వలేదు. అయితే వారిని గానీ, అత్తగారైన కుంతీదేవిని గానీ అగౌరవపరచలేదు ఎప్పుడూ. కులపత్నిగా తానేమి చేయగలదో, ఎలా మెలగాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది ఆమె. కౌరవుల దుష్కృత్యాలకు ప్రధాన భాధితురాలైన దానిగా తన మనసుకు ఏర్పడ్డ గాయాన్ని ఒక అసామాన్యమైన పట్టుదలగా మార్చుకుని పగ తీర్చుకున్నట్లు కనపడుతుంది. పగతో రగిలిపోయే ఒక అసాధారణమైన సౌందర్యరాశిగా ఆమె తన భర్తలు‌ కౌరవులతో యుద్దమే చేయాలని పట్టుదల పట్టింది. ప్రతి పురుషుడి విజయము వెనుకా ఒక స్థ్రీ‌ ఉంటుదన్న ఆధునిక కాలపు నానుడిని అనుసరించి అ కాలములో తన భర్తలు కురుక్షేత్రములో సాధించిన విజయములో వారి ధర్మపత్నిగా ఆమె పోషించిన పాత్ర ఎంతో కీలకమైనదని అందరూ గ్రహించి తీరాలి.

ఆమెకు సవతులున్నారు. కానీ ఎక్కడా ఎన్నడూ వారితో వాగ్యుద్దము చేయలేదు. పాంచాలదేశపు రాజైన ద్రుపదుని కూతురిగా, పాండవ పత్నిగా అనేక సుఖభోగాలను అనుభవించినా, భర్తలు అడవులకు వెళ్ళినపుడు వారితో పాటూ తానుకూడా కష్టాలలో పాలు పంచుకుంది. వారితోపాటే తన జీవితమనుకుంది. యుద్దానంతరము అశ్వర్థామ రాత్రి ఉపపాండవులను చంపినపుడు అర్జునుడు అశ్వర్థామను పట్టుకుని తీసుకువచ్చి పగతీర్చుకొమ్మని ఆమె‌ముందు ఈడుచుకొచ్చి పడేస్తే ~ నెను నా పుత్రులను పోగొట్టుకుని
ఎంత బాధననుభవిస్తున్నానో అంతే బాధ అశ్వర్థామ తల్లి తనలాగా పుత్రశోక బాధను పడగూడదని వాణ్ణి విడిచిపెట్టమని చెప్పడము ఆమె కరుణార్ద్రహృదయాన్ని తెలుపుతుంది.

ఇదే ద్రౌపది వ్యక్తిత్వము. ఇవన్నీ ఆమె మహాపతివ్రత అని చెప్పకనే చెబుతుంది.

Search LAtelugu