భీష్ముడు పరమపథం చేరిన మాఘశుద్ధ అష్టమిని "భీష్మాష్టమి''గాను, మాఘశుద్ధ ఏకాదశిని "భీష్మఏకాదశి''గాను మానవాళి స్మరించడమే, మనం ఆ పితామహునకు యిచ్చే అశ్రుతర్పణాలు. భారతజాతి మొత్తం ఆయనకు వారసులే. అందుకే జాతి, మత, కులభేదాలు విస్మరించి అందరూ ఆ మహాయోధునికి ఈ భీష్మఏకాదశి పర్వదినంనాడు తిలాంజలులు సమర్పించాలి.

"వైయాఘ్రపద్య గోత్రాయ సాంకృత్యప్రవరాయచ
గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే
అపుత్రాయ జాలందద్మి నమో భీష్మాయ వర్మణే
భీషశ్శాంతనవో వీర స్సత్యవాదీ జితేంద్రియః
ఆభిరర్బివాప్నోటు పుత్రపౌత్రో చితాం క్రియమ్ ''

అని ధర్మసింధువు చెబుతూంది. అంటే, "వ్యాఘ్రపాద గోత్రమునందు జన్మించినవాడు, సాంకృత్యప్రవరుడు, గంగాపుత్రుడు, ఆజన్మ బ్రహ్మచారి, అపుత్రకుడు అయిన భీష్మునకు తర్పణములు యిచ్చుచున్నాను. ఈ తర్పణములతో శాంతనపుత్రుడు, వీరుడు, సత్యసంధుడు, జితేంద్రియుడు అయిన భీష్ముడు పుత్రపౌత్రక్రియలవలె తృప్తినొందుగాక'' అను అర్థముగల ఈ మంత్రముతో అపసవ్యముగా యజ్ఞోపవీతము వెసుకుఇ, తర్పణమిచ్చి, ఆచమనము చేసి, సవ్యముగా యజ్ఞోపవీతము వేసుకుని ఈ క్రింది శ్లోకముతో ఆర్ఘ్యము యివ్వాలి.

"వసూనామవతారాయ శంతనోరాత్మజయచ
ఆర్ఘ్యం దదామి భీష్మాయ ఆ బాల్య బ్రహ్మచారిణే''

"అష్టవసువులకు ఎకావతారమగు శంతను పుత్రుడైన భీష్మునకు ఆర్ఘ్యం యిచ్చుచున్నాను'' అని అర్థం.

శాస్త్రం ప్రకారం తండ్రి లేనివారే తర్పణాలు యివ్వడానికి అర్హులు. కానీ, భీష్మునికి తర్పణాలు యిచ్చే విషయంలో తండ్రి జీవించివున్నా వారు కూడా తర్పణాలు యివ్వవచ్చునని ఋషులు సమ్మతించారు. అయితే జీవత్సతృకులు తర్పణాలు యిచ్చేటప్పుడు యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా వేసుకోకుండా కుడిచేతి బొటనవ్రేలికి చుట్టుకుని తర్పణాలు యివ్వాలి. బీష్మునికి తర్పణాలు యిస్తే బహుపుణ్యప్రదమని, అనేక జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్ర ప్రమాణం. అంతేకాదు ... "సంతానం లేని దంపతులు "భీష్మాష్టమినాడు'' కానీ "భీష్మఏకాదశి'' నాడు గానీ, భీష్మునికి శ్రాద్ధము (తద్దినం) పెడితే వారికి సత్ సంతానం కలుగుతుందని శాస్త్ర ప్రమాణం.

కనుక, ఈ భీష్మఎకాదశి పర్వదినాన భీష్మాచార్యునికి తిలాంజలులు సమర్పించి శ్రద్ధాంజలి ఘటిద్దాం. మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.

Search LAtelugu