గంగా, శంతనుల కుమారుడైన దేవవ్రతుడు, శంతనుని భార్యయైన సత్యవతి కోరిక మేరకు, రాజ్యాధికారాన్ని, వివాహాన్ని వదులుకొని, బ్రహ్మచర్య దీక్షతో జీవితాంతం గడుపుతానని “భీషణ” మైన ప్రతిజ్ఞ చేసి, దానికి కట్టుబడి ఉన్నందున “భీష్ముడు” అని పిలవబడ్డాడు. ఏ కురువంశ సంరక్షణ చేస్తానని తండ్రికి మాట ఇచ్చాడో, చిత్రాంగద, విచిత్రవీర్యుల మరణం తర్వాత ఆ కౌరవుల వంశం నిలిచిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా, ఆయన తన ప్రతిజ్ఞను మీరలేదు. తాను చేసిన భీషణ ప్రతిగ్నకు కట్టుబడి అనేకసార్లు తనకు పరీక్షలు ఎదురైనప్పటికీ తన ప్రతిజ్ఞ నుండి వెడలలేదు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని సత్యవతి యొక్క పుత్ర పౌత్రులను సంరక్షిస్తానని ప్రతిజ్ఞని జీవిత పర్యంతం నిలబెట్టుకున్నాడు.

Аксессуары

పాండవులు ధర్మపక్షంలో ఉన్నారు గనుక వారికి ఓటమి సంభవించదు. కానీ తాను పాండవ పక్షంలో ఉన్నచో తనకు స్వచ్చంద మరణమే. యుద్ధంలో తాను పడిపోడు. వీర మరణం పొందిన ఫలం లభించదు. అదే కౌరవ పక్షంలో ఉంటే శిఖండి వలన పడగొట్టబడి యుద్ధరంగంలో మరణించిన ఫలితాన్ని పొందవచ్చు. తన మాటకు ఎంతగా కట్టుబడ్డాడంటే, దుర్యోధనాదుల అరాచకాలు తెలిసీ కూడా, పెద్దదిక్కుగా వారికి మంచి చెప్పడం వరకే తన బాధ్యతను పరిమితం చేసుకున్నాడు కానీ, వారిని ఎదిరించలేదు. దీనికి నిదర్శనంగా ద్రౌపదీ వస్త్రాపహరణం, లక్కఇల్లు దహనం, పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వకపోవడం వంటివి మనం చెప్పుకోవచ్చు. యుద్ధరంగంలో గాయపడినప్పుడు అంపశయ్య పైన గాయాలతో ఉత్తరాయణం వరకూ వేచి ఉండడమే దీనికి పరిహారమని ఆయన భావించాడు. జన్మతః క్షత్రియుడైనప్పటికీ, క్షాత్రధర్మం కన్నా ఆయనలో బ్రాహ్మణధర్మమే (దుర్యోధనాదులకు మంచి చెప్పడం) ఎక్కువగా అగుపిస్తుంది. తండ్రిచే స్వఛ్చంద మరణాన్ని వరంగా పొందాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు, భీష్ముని ఎదిరించలేక, భీష్ముని అస్త్రసన్యాసం కొరకు, శిఖండి ముందునుంచుకొని పోరాడితే, ఆయుధాలు విడిచి పెట్టాడు.

ఉత్తరాయణ ప్రాశస్త్యమును లోకానికి తెలియజేయడం కోసమే మహాభారత యుద్ధం తరువాత 46 రోజులు అంపశయ్య మీదనుండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాత మరణాన్ని ఆహ్వానించాడు. ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. తన తండ్రి శంతనుడు తనకు ప్రసాదించిన స్వచ్చంద మరణం యొక్క గొప్పదనాన్ని లోకానికి చాటిచెప్పడం కూడా గమనించవచ్చు. అర్జునుడు వదిలిన బాణాలనే అంపశయ్యగా చేసుకుని, ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ ఎదురుచూస్తూ గడిపాడు భీష్ముడు. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడని తెలిసిన అతికొద్దిమందిలో భీష్ముడు ఒకడు. ఆయన దర్శనం కోసం ఎంతగానో పరితపించాడని తెలుసు కాబట్టే అంపశయ్య మీద ఉన్నప్పుడు, మరణ సమయం దగ్గరపడినప్పుడు కృష్ణుడే ఆయన్ను చూడడానికివచ్చి తన దర్శనభాగ్యం కలిగించాడు. భీష్ముడిని మించిన ధర్మవేత్తలేరని, ధర్మరాజుని ఆయన దగ్గరకు ధర్మసూక్ష్మాలు తెలుసుకోమని చెప్పి పంపించాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర సంగ్రామానంతరం విజయుడైన ధర్మరాజు, భీష్ముని వద్దకు మార్గనిర్దేశం కోసం వచ్చాడు. ఆత్మీయులని వధించానని కుమిలిపోతున్న ధర్మరాజుని తన వచనాలతో స్వాంతన పరిచాడు.

ధర్మరాజు భీష్ముని అతని జీవితములో అంత ఉన్నతుడుగా ఉండుటకు వెనుకనున్న రహస్యాన్ని, ఏది జనన, మరణచక్రం నుండి బయటపడేస్తుందో, ఏది నిత్యానందాన్నికలిగిస్తుందో, ఏది భగవంతుని అనుగ్రహాన్ని కలిగిస్తుందో ఆ రహస్యాన్ని బోధించమని కోరాడు. భీష్ముడు శ్రీకృష్ణుడే అందుకు తగినవాడని చెప్పి విష్ణుసహస్రనామాన్ని అందించాడు. శ్రీకృష్ణుడు తనకు ఇచ్చిన శక్తితో తన సుదీర్ఘ జీవితములో అనేక ఋషులనుండి, మహనీయుల నుండి నేర్చినవి, భగవంతుని అనేక రూపాలలో కొలిచిన మహనీయుల బోధలను క్రోఢీకరించి, రాజధర్మాలు, వర్ణాశ్రమధర్మాలు మొదలగునవి తెలియచెప్పాడు. ధర్మరాజుకే కాదు, లోకానికంతా కూడా ద్వాపర యుగం చివరిదశ, కలియుగం ప్రారంభామవబోయే దశలో లోకానికంతటికీ ధర్మ సూక్ష్మాలు తెలిపిన మహాజ్ఞాని.

తండ్రి కోరిక తీర్చడం కోసం రాజ్యాధికారం, ఇతర భోగములు వంటి విషయములు త్యాగములే కాక ‘అపుత్రస్య గతిర్నాస్తి’ అని ఎరిగి కూడా తండ్రి కోరికపై ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయి తండ్రి ఋణం తీర్చుకొన్నాడు. మాఘ శుద్ధ అష్టమి (భీష్మాష్టమి) మొదలుకొని మాఘ శుద్ధ ద్వాదశి వరకూ కల ఐదు రొజులనూ భీష్మ పంచకము అని అంటారు. భీష్ముడు మాఘ శుద్ధ అష్టమి మొదలుకొని మాఘ శుద్ధ ద్వాదశి వరకూ యోగ సమాధి యందుండి ద్వాదశి నాడు స్వర్గాన్ని పొందెను. అందుకే ఈనాటికీ కూడా భీష్మునికి భీష్మాష్టమి నాడు అందరూ తర్పణాలు ఇస్తారు. ఈ ఐదు రొజులనూ నియమనిష్టలతో భగవంతుని స్మరణలో గడపడం ఎంతో శుభప్రదం.

అందుకు సంతసించిన శ్రీకృష్ణుడు మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మ సంస్మరణ దినంగా, భీష్మఏకాదశిగా ప్రకటించాడు. భీష్ముని ఆత్మ, మాఘ శుద్ధ అష్టమి నాడు పరమాత్మయైన శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్మఏకాదశి రోజు భక్తులు ఉపవాసాన్ని ఆచరిస్తారు లేదా కనీసం సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు, అలాగే ఎక్కువ సమయాన్ని భగవదారాధనలోనే గడుపుతారు. ఈరోజున అన్ని గ్రహాల యొక్క ప్రభావం మనుషులపై శుభప్రదముగా ఉండి, వారిలో సాత్వికభావనలను ప్రేరేపించి, తద్వారా జ్ఞానోదయాన్ని పొందేలా చేస్తుంది. ఈ రోజు భీష్మపితామహునికి నివాళిగా విష్ణుసహస్ర నామపారాయణ చేస్తారు. విష్ణుసహస్రనామం అంటే భగవద్గీత మరియు సకల వేదాల సారం. విష్ణుసహస్రనామం అత్యంత సుందరమైనది, మధురమైనది, శ్రావ్యమైనది, సులువుగా వల్లించతగినది, అలాగే నిత్యజీవితములో సులువుగా ఆచరించతగినది. ఈ విష్ణుసహస్రనామం మనకు దుష్టశక్తుల నుండి రక్షణ కల్పించునది, జీవితకాలములో మనకు కావలసిన వాటిని అందించేది అలాగే అంత్యములో మోక్షమును ఒసగేది. కాబట్టి ఇంతటి ఉత్కృష్టమైన విష్ణు సహస్రనామాన్ని నిత్యం పారాయణ చేద్దాం లేదా నిత్యము విందాము.

Search LAtelugu