ఒకఊళ్ళో పేద,అమాయకమైన కృష్ణభక్తురాలైన ఒక యాదవస్త్రీ ఉండేది. గోక్షీరాన్ని,పెరుగు,వెన్న,నెయ్యి అమ్ముకొంటూ జీవనాన్ని సాగించేది. ఆమె ఎక్కడవిన్నదో ఎవరన్నారోగానీ కృష్ణార్పణం అన్నమాట విన్నది. అదేదో మంత్రమనుకొని ప్రతివిషయానికీ కృష్ణార్పణమనడం మొదలుపెట్టింది. ఆ పదమెంతగా అలవాటయ్యిందంటే లేవగానే కృష్ణార్పణం, పడుకొనేముందు కృష్ణార్పణం, భుజించేముందు, బోజనం తరువాత, బయటకెళ్ళేముందు ఇంటికొచ్చిన తరువాత..కృష్ణార్పణమే. చివరకు చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగావేసేటప్పుడూ కృష్ణార్పణం అనటమే !

Air Max

ఆవిడ ఇలామొదలుపెట్టగానే ఆఊరిలో కలకలం చెలరేగింది. విషయమేమిటంటే ఆఊరిలో ఉన్న శ్రీకృష్ణదేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయం పడుతోంది. ప్రతీరోజూపూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్తపడుతోంది. ఎలాగో ఎవరికీ అర్ధం కాక నిఘాపెట్టారు ఊరిజనమందరిమీదా. చివరకు ఈ గొల్లస్త్రీ చెత్తఊడ్చిపారేయడం, అక్కడ కృష్ణుడిపై చెత్తపడటం ఒకేసమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడచేసినదానికి ఉగ్రులై ఆదేశపు రాజుగారిదగ్గరకు తీసుకుపోయారు.

రాజుగారు చెప్పినదంతావిని ఆవిడ నాకేమీతెలియదని ఎంతఏడుస్తున్నా కారాగారశిక్షవిధించారు ఖిన్నురాలై ఏడ్చుకొంటూ కారాగారంలోకివెళ్తూ కృష్ణార్పణమంది. మరుసటిరోజు స్వామి విగ్రహం వెనుకకుతిరిగిపోయింది.నాకీపూజలువద్దు అని బెట్టుచేస్తున్న చిన్నిబాలుడిలా. ఐనా పట్టించుకోకుండా యధాతధంగా పూజలు చేశారు. ఆమె కటికనేలపై పడుకొనేముందు కృష్ణార్పణమనుకుంది. రెండవరోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొనుంది. ఇక మూడవరోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంతప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు.

ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదోతగిలి ఆమెకాలుబ్రొటకనవేలు ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా కృష్ణార్పణమనగానే గాయం మాయమయ్యింది. అదిచూసిన కారాగృహాధికారి పరుగుపరుగున రాజుగారికి చెప్పాడు. అదేసమయంలో ఆఊరి జనం కూడా రాజుగారిదగ్గరకు చేరుకున్నారు. మహాప్రభో శ్రీవారి విగ్రహం బ్రొటకనవేలునుంచి ధారాపాతంగా రక్తమొస్తోంది. ఎన్నికట్లుకట్టినా ఆగట్లేదు.

విషయం అర్ధమవ్వట్లేదు అని వాపోయారు.రాజుగారి ఆ స్త్రీని అడిగారు. నీగాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని. తెలియదు నాకు అంది. సరే ఏదో మంత్రం చదివావటకదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది. సభలో వారందరూ హతాశులయ్యారు. ఆమెని నీకు కృష్ణార్పణమంటే ఏమిటో తెలుసా అని అడిగితే, తెలియదు ఏదో మంత్రమనుకుంటా. ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను. అలా అనటం తప్పాండీ? ఆమంత్రం నేను జపించకూడదా? ఐతే తెలియకచేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అడిగింది.

సభికులుపెద్దల కళ్ళల్లు చెమర్చాయి ఆమె అమాయకత్వానికి. ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్ధాన్ని వివరించి కాళ్ళమీదపడ్డారు. ఇంతలో ఆమె ఘోరాతిఘోరంగా రోదించడం మొదలెట్టింది. అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను..స్వామివారిమీద చెత్తపోసాను. నాగాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను. నాపాపానికి శిక్షేముంటుంది అనుకొంటూ శ్రీకృష్ణాలయానికి పరుగుపరుగునపోయింది.
చిరునవ్వులురువ్వుతూన్న నందకిషోరుడుని చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది. ఆరోజునుంచీ శుద్ధిగా భోజనం వండి తినేముందు కృష్ణార్పణమనడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు.

సకలచరాచరసృష్టికర్త తనంతటతానే కావాల్సింది తీసుకోగలడు. భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించినదానినికూడా అత్యంతప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు. ఆమెభక్తిభావాన్ని లోకానికిచాటిచెప్పడానికి చెత్తనేతనపై వేసుకున్న భక్తలోలుడిలీలలకు అంతమేముంటుంది?.

Search LAtelugu