ఆధ్యాత్మికపరంగా స్త్రీలకు కొన్ని సందేహాలు కలుగుతుంటాయి. ఋతుకాలమందు ఎప్పటిలా దైవ ధ్యానం చేయవచ్చా?  గ్రంధ పారాయణం చేయవచ్చా? ... యిత్యాది సందేహాలు కొన్ని కలుగుతుంటాయి. ఇటువంటి సందేహాలకు జవాబులు మన శాస్త్రాలలో వున్నాయి.
 
శాస్త్రములో కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు వర్గములు వున్నాయి. వీటిలో కర్మకాండ విధి ననుసరించిన కార్యములు ఋతుకాలమున చేయరాదు. అవి యజ్ఞాది క్రతువులు, దేవతార్చన, గ్రంధపారాయణం, వాద్యములతో భజన చేయుట, కృష్ణాజినాది ఆసనములపై కూర్చుండుట, తులసి రుద్రాక్షాది మాలలతో జపమాచరించుట మొదలగునవి చేయరాదు. ఎందుచేతనంటే విగ్రహాది పూజల విషయమై పైన చెప్పినవన్నియూ దేహమునకు అన్యములు.

కానీ, పరమాత్మ సర్వదా తానై ఆత్మరూపంలో హృదయమునందు ఉంటాడు. ఈ ఆత్మ సదా శుద్ధమై, ముక్తమై ఉంటుంది. దానికి దేహేంద్రియములతో సంబంధం లేదుకనుక, దేహ, కాలబేధ విచారము జేయకనే బ్రహ్మనిష్ఠ చేయవలయునన్నది శాస్త్రవచనం. దేహపరంగా యోచిస్తే ఈ శరీరం మలినపూరితమే.

అత్యంత మలినో దేహో దేహీ త్వత్యంత నిర్మలః 
ఉభయోరంతరం జ్ఞాత్వా కస్యశౌచం విధీయతే 
 
పంచభూత సమ్మేళనమై మలమూత్ర క్రిమికీటక సంకులమైన ఈ దేహం సర్వదా అశుచియే.  శుద్ధమై ముక్తమై యుండెడు ఆత్మ మాత్రం సర్వదా పరిశుద్దముగా యున్నది. కావున ఏ సమయమందైనను బ్రహ్మ(దైవ) ధ్యానం మాత్రం తప్పక చేయవచ్చును. 
 
ఓసారి శ్రీరమణ మహర్షి వారు ఈ సందేహం వెలిబుచ్చిన స్త్రీలతో 'ఏమేమీ? లోపలున్న చైతన్యం ఋతుకాలమందు ప్రక్కకు తప్పుకుంటుందా? బయటికి వచ్చేస్తుందా...ఏం?ఎప్పుడూ హృదయంలో ఉండేదానిని ధ్యానించడం మానేయాలా ఏం?'అని చమత్కరించారట. 
 
నో దేశ కాలనియమః శౌచాశౌచ వినిర్ణయః 
పరం సంకీర్తనాదేవ రామరామేతి ముచ్యతే 
 
పరమాత్మ ధ్యానమునకు దేశకాల నియమం లేదు. అలాగనే శౌచ అశౌచ బేధమూ లేదు. శ్రీరామరామ అను పరమోత్కృష్టమగు సంకీర్తనను ఏ సమయమందు చేసినను బంధములనుండి విముక్తులగుదురు. 'ఆత్మ' ఋతుకాలమందును, ఇతర కాలములయందు కూడా హృదయమునందే యుండును. ఇది స్వజాతీయ, విజాతీయ, స్వగత, మలిన, అమలిన బేధరహితం. అది అఖండమై విరాజిల్లు శుద్ధమైన చైతన్య స్వరూపం. కనుక సర్వకాలములయందు, సర్వావస్థలలో ధ్యానించవచ్చును. 
 
రత్యంతరే మూత్ర పురీషయోర్వా చండాలవేశ్మన్యధవా శ్మశానే 
కృతప్రయత్నో ప్యకృత ప్రయత్నః సదా స్మరేత్ కేశవనామధేయమ్ 
 
(వైశ్వానరస్మృతి) రతికాలమందు గాని, మలమూత్ర విసర్జన సమయమందు గాని, చండాలులు ఉన్నచోట వున్నగాని, శ్మశానభూమి యందుండి గాని, స్నాన సంధ్యాది కృత్యములచే శుచితో గూడి గాని, లేక కాలు చేతులు కడుగకనే గాని, సర్వేశ్వర స్మరణధ్యాన కీర్తనములను చేయవచ్చును. శరీరాదులందెంత మాలిన్యము ఉండినను ఆత్మకు అవి అంటవు. దుర్గంధజలమందు ప్రతిబింబించిన సూర్యునకు ఆ దుర్వాసన అంటునా?
 
శుచిర్వా ప్యశుచిర్వాపియో జపేత్ ప్రణవం సదా 
స న లిప్యతి పాపేనా పద్మపత్ర మివాంభసా 
 
(యోగాచూడామణ్యుపనిషత్) శుచితో, లేదా ఆశుచితోనైనను ఎవరు పరమాత్మను ధ్యానించునో వారు తామరాకేలగున నీటిలో తడవకుండునో అలాగున సంసార మాలిన్యముచే స్పృశింపబడడు. అలానే దేహానికే గాని, ఆత్మకు శరీరాది దోషములు అంటవని గీత యందు కృష్ణపరమాత్మ చెప్పిన ఓ రెండు శ్లోకములను పరిశీలిద్దాం - 
 
యధా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవి: 
క్షేత్రం క్షేత్రీ తధా కృత్స్నం ప్రకాశయతి భారత 
 
సూర్యుడు లోకమంతయూ ప్రకాశించిచుండునను, లోకం తనయందు ఎట్లు యుండదో అట్లే ఆత్మ అన్ని జీవరాసులలోను ప్రకాశించుచుండునను ఆ శరీరాది దోషములు ఆత్మను అంటవు. 
 
యధా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే 
సర్వత్రావస్థితో దేహే తధాత్మా నోపలిప్యతే 
 
సర్వవ్యాపి అగు ఆకాశం అతిసూక్ష్మమగుటచే దానియందున్న భూతజాలములచే ఎట్లు మాలిన్యమును పొందదో అట్లే సర్వత్ర అన్ని ఉపాధుల యందును నిండియున్నను ఆత్మ మాలిన్యమునొందదు. ఈ రీతిలోనే మరో విషయాన్ని తెలుసుకోవాలి - శౌచాచారాది క్రియలు దేహమందు జరిపినను హృదయం శుద్ధిగా లేనిచో పరమాత్మధ్యానం నిష్ప్రయోజనం. 
 
సర్వేషామేవ శౌచానా మర్ధశౌచం పరం స్మృతమ్  
యోర్ధే శుచి: స తు శుచి: న మృద్వారి శుచిశ్శుచి:
 
(చాణక్యస్మృతి) సమస్త శౌచాది క్రియలలో మనః పారిశుద్ధ్యం గొప్ప శుద్ధియని మహర్షులు తలంచుదురు. ఎవరు నిర్మలాత్ములై యుందురో, వారెంత యశుద్ధంగా ఉండినను మహాశుచి గలవారే. ఆత్మశుద్ధిలేనివారు మృజ్జలాదులచే ఎన్నివిధముల శుద్ధి చేసినను వారు మహా అశుద్ధులే. మరి పరమార్ధ చింతన చేయువారికి ఉండవలసిన హృదయశుద్ధి ఎలా అలవడుతుందంటే - 
 
వాచాం శౌచం చ మనసః శౌచమింద్రియ నిగ్రహః 
సర్వభూత దయా శౌచ మేతచ్చౌచం పరార్ధినామ్  
 
( హితోపదేశం) 
 
1. వాక్శుద్ధి (సత్యంగా, హితంగా, మధురంగా పలుకుట) 
2. మనశుద్ధి (విషయవాసనా రహితమై యుండుట) 
3. చక్షురాదీంద్రియశుద్ధి (నేత్రాదీంద్రియములు  వాటి వాటి విషయములగు చెడ్డవృత్తులలో ప్రవేశింపకుండుట) 
4. సమస్త ప్రాణుల యందు కారుణ్య ముండుట. ఇవియే హృదయాన్ని శుద్ధిచేసే సాధనోపకరణములు. 
 
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపివా 
యస్స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచి: 
 
స్నానాది క్రియలచే శుద్ధుడై గాని, స్నాన సంధ్యాదుల చేయక ఆశుద్ధుడై గాని, లేక అన్ని అవశాలను పొందియుండి గాని పరమాత్మధ్యానం చేయవచ్చును. అట్లు ధ్యానిన్చువారు ఆ ధ్యాన పవిత్రతచే ఆశుచివారైనను అంతర బాహ్యశుద్ధులను కలిగినవారే అగుదురు.
ఈ విధంగా శాస్త్రాలు, పెద్దలు చెప్పారని శుచి ఆచారాదులు అవసరం లేదని భావన తగదు. శాస్త్రాలు చెప్పేదేమిటంటే - దేహానికి సంబందించిన సహజప్రక్రియలను ఆశుద్ధత్వముగా, అనర్హతగా భావించి పరమాత్మ ధ్యానాన్నీ, స్మరణని  విడువరాదని! స్నానశౌచాచారములు తప్పక యుండవలెను. ఆశుచిత్వం తమోగుణం. తమోగుణం సాధకులకు పనికిరాదు. 
'అచారహీనం న పునంతి వేదాః' ఆచారహీనున్ని వేదములు పవిత్రునిగా చేయజాలవు, కావునా ఆధ్యాత్మిక జిజ్ఞాసపరులకు శుద్ధశౌచారములు తప్పనిసరి.
 
జై శ్రీమాన్న్నారాయణ

Comments  

0 #2 కొన్ని సందేహాలుNoemi 2017-09-28 18:55
I see your blog needs some fresh posts. Writing manually takes a lot of time, but there
is tool for this boring task, search for: Wrastain's tools for content

My site - FlorX: https://Christiane2009.jimdo.com
Quote
0 #1 కొన్ని సందేహాలుAimee 2017-09-11 11:55
I see your blog needs some fresh content. Writing manually takes
a lot of time, but there is tool for this boring task, search for; Wrastain's tools for content

Feel free to visit my webpage: CeciliaX: https://Eric2009.blogspot.com
Quote

Add comment


Security code
Refresh