ప్రతి వినాయకచవితినాడు మనం చదువుకునే చక్కని కథ శమంతక మణి కథ. ఒక్క శమంతకోపాఖ్యానం తెలుసుకోవడం వల్ల చాల విషయాలు తెలుస్తాయి.

తవ హ్యేషాశమంతకః

  • అహంకారము ఎంత ప్రమాదాన్ని తెస్తుందో చంద్రుని గాధ చెప్తుంది.
  • బాహ్య సౌందర్యం కాన్న అంతః సౌందర్యం ఎంత గొప్పదో విగ్నేశ్వర వృత్తాంతం చెప్తుంది.
  • లోకంలో అన్ని అందరికి అన్వయము కావు అని శమంతక మణి చెప్తుంది.
  • కర్మానుష్టానములో సౌచము (పరిశుభ్రత) ఎంత ముఖ్యమో ప్రాసెనోపాఖ్యానము చెప్తుంది.
  • దాచుకుందాము అనుకున్నవాడు చివరకు ఏమైపోతాడో సత్రాజిత్తు ఉపాఖ్యానం చెప్తుంది.
  • ఆడవారి మీద పిచ్చి పెంచుకోవడం ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో అక్రూరుని వృత్తాంతం చెప్తుంది.

ఒక్క శంతకోపాఖ్యానం వింటే జీవితంలో వచ్చే ఎన్నో కష్టాలను, జీవితంలో వున్నా వైక్లబ్యములను దిద్దుకోవొచ్చు. ఇన్నిటిని దిద్దగలిగిన కథ కాబట్టి ఎంత కాలం గడిచినా అదే కథ ప్రాచుర్యములో వున్నది.

భద్రపదమాసంలో మనం వినాయక వ్రతకల్పము చేస్తాము. కల్పము అంటే ఋషి నిర్ణయించింది అని అర్ధము. కల్పమును ఋషి నిర్ణయించినట్లే చెయ్యాలి గాని దానిలో మార్పులు తీసుకురాకూడదు. తత్వ పరిశీలనా చెయ్యగలిగితే అది ఆలా ఎందుకు చెయ్యాలి అని ఋషి నిర్ణయించారో మనకు అర్ధమవుతుంది. ఈ వినాయక వ్రతకల్పములో అంతర్భాగము కథాశ్రవణము. అందులో వచ్చేది శమంతకోపాఖ్యానం.

శమంతకోపాఖ్యానం విష్ణుపురాణం, స్కాందపురాణాంతర్గతముగా వస్తుంది. పూర్వం నిఘ్నుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు సత్రాజిత్తు, ప్రసేనుడు కుమారులు. సత్రాజిత్తు పెద్దవాడు. గొప్ప ఈశ్వర భక్తి తత్పరుడు. సూర్యుని మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యుని ప్రార్ధిస్తే ఆ సూర్యుడు సాకార రూపముతో సత్రాజిత్తుని అనుగ్రహించడానికి వచ్చాడు. కానీ సత్రాజిత్తుకి సూర్యుడు కనపడలేదు. సత్రాజిత్తు కంటికి ఎందుకు కనబడలేదు అని సూర్యని అడిగితే సూర్యుడు సత్రాజిత్తుతో నేను ఈరోజు శమంతక మణిని ధరించి వున్నందుకు నీకు కనపడటం లేదు అని ఆ శమంతకమణిని తీసి పక్కన పెట్టాడు. సత్రాజిత్తు ఆశ్చర్యముతో ఆ శంతకమని గురించి అడుగగా అప్పుడు సురుడు ఆ మణి గొప్పదనము చెప్పాడు.

శమంతకమణి అగ్ని సంబంధమైనది. అందువలన అగ్ని సంభంధములైన ఉత్పాదితములు వుండవు. ప్రమాదములు వుండవు. అతి వృష్టి అనావృష్టి వుండవు. రోజుకు ఎనిమిది బారువుల బంగారము ఇస్తుంది. కానీ ఈ శమంతకమణి ధరించడానికి అంతఃసౌచాము మరియు బాహ్య సౌచాము కావలి. సౌచాము లేకపోతే అది ప్రమాదానికి దారి తీస్తుంది. కాబట్టి ఈ మణిని అందరు ధరించరాదు. ఎలా అయితే ఒక మందు ఒకరికి సరిపోయినది ఇంకొరికి సరిపోదో అలానే అందరు ఈ మణిని ధరించడానికి అర్హులు కారు.

అలాంటి శమంతకమణిని తనకిమ్మని సత్రాజిత్తు సూర్యని అడిగాడు. అడిగిన వెంటనే సూర్యుడు ఆ శమంతకమణిని సత్రాజిత్తునకు ఇచ్చాడు. ఆ మణిని ధరించగానే సత్రాజిత్తు వెలిగిపోతూ కనిపించాడు. ఆ మణిని ధరించి సత్రాజిత్తు ద్వారకా నగరమునకు వెళ్తుంటే ఆ వెలుగు చూసి అందరు సూర్య భగవానుడు అని భ్రమపడి కృష్ణ భగవానుని దగ్గరకు వెళ్లి సూర్యుడు మీ దర్శనానికి వస్తున్నాడు అని చెప్పారు. అన్ని తెలిసి తెలియనట్లు వుండే ఆ కృష్ణుడు సత్రాజిత్తునకు ఎదురు వెళ్లి ఆహ్వానించి కూర్చోపెట్టి సకల మర్యాదలు చేసాడు.

అప్పుడు సత్రాజిత్తు శమంతకమణి గురించి కృష్ణునికి తెలియచేసి ఆ మణి వల్లే తనకి ఆ కాంతి వచ్చింది అని చెప్పాడు. కృష్ణుడు అది విని సత్రాజిత్తుతో - ఆ మణి రోజుకు ఎనిమిది బారువుల బంగారమును ఇస్తుంది. అలాంటి మణి ఉంటే ఒక నాటికి తనదగ్గర రాజు కన్నా ఎక్కువ డబ్బు ఉంటుంది. అర్ధ శాస్త్రం ప్రకారం ఆలా ఉండకూడదు. అవ్యవస్థ వస్తుంది. అంతే కాక ఆ మణి ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదములు రావు. అలాంటి మణి ఒక ఇంట్లో ఉండడం కంటే రాజు దగ్గర ఉంటే రాజ్యం అంతా బాగుపడుతుంది. క్షేమంగా ఉంటుంది. కాబట్టి ఈ మణిని తీసుకు వెళ్లి రాజుగారికి ఇవ్వమని చెప్పాడు. సత్రాజిత్తు ఆ మాటలు విని ఏమి బదులు చెప్పకుండా వెళ్ళిపోయాడు. కానీ సత్రాజిత్తు మనసులో మాత్రం ఈ మణిని కృష్ణుడు అపహరిస్తాడేమో అన్న భయం మాత్రం మొదలు అయ్యింది.

ఆ మణిని శారీరకంగా బలము కలవాడైన ప్రసేనుడు మేడలో వేసుకుని తిరగటం మొదలు పెట్టాడు. ఒకనాడు ప్రసేనుడు కృష్ణునితో కలసి వేటకు వెళ్ళాడు (స్కాంద పురాణాంతర్గతముగా). అది భాద్రపద శుక్ల చతుర్థి. ఆ రోజునే విఘ్నేశ్వరుని ఆవిర్భావం. ఆ రోజున కృష్ణుడు తలఎత్తి చూడగా చంద్ర దర్శనము అయ్యింది. అడవిలో వేటాడుతూ ఉండగా ప్రసేనుడు దారి తప్పిపోయాడు. ప్రసేనుడి మెడలో శమంతకమణి వున్నది. అంతలో ప్రసేనునికి మూత్ర విసర్జన చెయ్యవలసి వచ్చింది. కానీ ఆ అడవిలో తాను వున్నచోట సౌచముగా ఉండటానికి నీళ్లు కనపడలేదు. దానితో బాహ్యములో ప్రసేనునికి అసౌచాము వచ్చింది. ఆ అసౌచాముతోనే ప్రసేనుడు ముందుకు వెళ్ళాడు. అసౌచాముతో మణి ధరించకూడదని సూర్యుడు చెప్పినా ధరించడముతో ఒక సింహము వచ్చి ప్రసేనుడిని చంపి ప్రసేనుడి శరీరమును తినేసింది. తిన్న తరువాత అక్కడ మెరిసిపోతున్న ఆ మణిని నోటకరుచుకొని సింహం అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ మణిని నోటకరుచుకుని వెళ్తున్న సింహమును జాంబవంతుడు అను భల్లూకము చూసింది. భల్లూకము శాకాహారి. దానికి సింహమును చంపవలసిన అవసరము లేదు. కానీ ఆ భల్లూకము సామాన్యమైనది కాదు. త్రేతాయుగ ప్రారంభమున పుట్టిన ఆ జాంబవంతుడు కారణజన్ముడు. ఆ జాంబవంతుడు ఆ సింహము నోటిలో వున్న మణిని చూసి ఆ సింహమును చంపి ఆ మణిని తీసుకుని తనకు అప్పుడే జన్మించిన కుమారునికి ఆటవస్తువుగా ఇచ్చాడు.

ఇంతలో చీకటిపడడంతో ప్రసేనుడు కనపడక పోవడంతో, కృష్ణుడు ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ చంద్రుని చుసిన కారణముగా కృష్ణుడే ఆ ప్రసేనుడిని చంపి ఆ మణిని ఎత్తుకు పోయాడు అని సత్రాజిత్తు ఇంకా ఆ రాజ్యంలోని వారందరు నీలాపనిందలు వేశారు. ఆ నీలాపనిందలు తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు కొంతమంది పెద్దలను తీసుకుని ప్రసేనుడిని వెదకడానికి వెళ్ళాడు. అడవిలో ప్రసేనుడి కళేబరము, సింహపు కాలిజాడలు, సింహపు కళేబరము, భల్లూకపు కాలిజాడలు కనిపించాయి. ఆ భల్లూకపు కాలిజాడలు ఒక గుహలోకి వెళ్లాయి. కృష్ణునితో వచ్చిన ఆ పెద్దలు గుహలోకి రావడానికి భయపడి బయటే ఉండిపోగా కృష్ణుడు మాత్రం గుహలోకి వెళ్ళాడు.

కృష్ణునికి గుహలో ఒక చిన్న పిల్లవాడు ఉయ్యాలలో ఊగుతూ కనిపించాడు. ఆ వుయ్యాలమీద ఆ మణి కట్టబడి కనిపించింది. ఎంతో ప్రకాశవంతమైన ఆ మణితో జాంబవంతుని కుమారుడు ఆడుకుంటూ కృష్ణునికి కనిపించాడు. ఊయలలో ఉన్న ఆ పిల్లవాడిని యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయి (జాంబవతి) ఊపుతోంది. ఆ జాంబవతి జాంబవంతుని కుమార్తె. కృష్ణుడు జాంబవతిని చుసిన సమయంలో జాంబవతి కూడా ఆ మోహన రూపుడైన ఆ కృష్ణుని చూసింది. ఆ ముగ్ధ మోహన రూపమును చుసిన జాంబవతి కృష్ణుడు శమంతకమణి గురించే వచ్చాడని గ్రహించింది. ఆ పక్కనే జాంబవంతుడు పడుకుని వున్నాడు. తండ్రి వల్ల కృష్ణునికి ప్రమాదమొస్తుందేమో అని, శమంతకమణిని నిశ్శబ్దముగా తీసుకుని వెళ్ళమని కృష్ణునికి ఎలా చెప్పాలో తెలియక ఒక పద్యరూపములో పాటలాగా పిల్లవాడిని లాలిస్తున్నట్లుగా జాంబవతి పాడింది.

సింహ ప్రసేన మమధీహి సింహో జామ్బవాతాహతహ
సుకుమార కామరోధీహి తవ హ్యేషాశమంతకః

ఓ పిల్లవాడా ఏడవకు. ప్రసేనుడిని చంపిన సింహమును జాంబవంతుడు చంపి ఈ శమంతకమును నీకోసం తీసుకుని వచ్చాడు. ఈ మణి నీదే.

పిల్లవాడికి చెప్పినట్లుగా ఆంగికముతో సౌంజ్ఞలు చేస్తూ కృష్ణునికి చెప్పింది. కానీ కృష్ణుడు దానికి అంగీకరించక జాంబవంతుని లేపాడు. రామావతారంలో జాంబవంతునికి రాముని కౌగిలించుకోవాలి అని కోరిక. కానీ ఆ అవతారంలో రామ కౌగిలి కేవలము సీతమ్మతల్లికే. హనుమను కౌగిలించుకున్న స్థితి వేరు. రాముడు జాంబవంతుని చూసి నీ కోరిక తరువాతి అవతారంలో తీరుస్తాను అని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మళ్ళి అంతే ముగ్ధ మనోహర రూపముతో కృష్ణునిగా జాంబవంతునికి దర్శనమిచ్చారు. ఇరవైఒక్క రోజుల పాటు కృష్ణుడు కొడుతూనేవున్నా, రక్తం కారుతూనే వున్నా, జాంబవంతుడు మళ్ళి మళ్ళి వెళ్లి ఆ కృష్ణుడిని గట్టిగా పట్టుకుంటునే వున్నాడు. ఎంత కొడుతున్న కృష్ణుని వదలాలి అని జాంబవంతునికి అనిపించలేదు. ఇరవైఒక్కరోజుల తరువాత జాంబవంతునికి అనిపించింది. ఇది ఖచ్చితముగా రాముడే. ఈ రూపములో వచ్చినది రాముడే అని స్తుతించాడు.

కృష్ణుడు అనుగ్రహించి శమంతకమును ఇవ్వమిని అడుగగా, శమంతకముతో బాటు కన్యామణిని కూడా ఇచ్చాడు. కృష్ణుడు శమంతకమణిని, జాంబవతిని తీసుకుని తిగిరి ద్వారకా నగరానికి చేరుకున్నాడు. శమంతకమణిని సత్రాజిత్తునకు ఇచ్చేసాడు. సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కృష్ణునికి ఇచ్చి వివాహము చేసి శమంతక మణిని కూడా ఇచ్చాడు. కానీ కృష్ణుడు ఆ శమంతకమణిని తిరిగి సత్రాజిత్తునకు ఇచ్చివేసి సత్యభామతో ఇంటికి వెళ్ళిపోయాడు.

అదే సమయములో కృష్ణునికి లక్క ఇంట్లో పాండవులు తగలబడిపోయారు అని సమాచారం వచ్చింది. కానీ ఆలా జరగలేదు అని కృష్ణునికి తెలుసు. కాని తెలియనట్లు హస్తినలో ధృతరాష్ట్రుని పరామర్శించడానికి వెళ్ళాడు.

అక్రూరుడు, శతధన్వుడు, కృతవర్మ ఇంతకుముందే సత్యభామను తమకు ఇచ్చి పెళ్ళిచేయమని సత్రాజిత్తును అడిగారు. కానీ కృష్ణుడు శమంతకమణిని తీసుకుని వచ్చినప్పుడు సత్యభామను కృష్ణునికి ఇచ్చి వివాహము చేసాడు. కృష్ణుడు హస్తినకు వెళ్లిన సమయములో అక్రూరుడు కృతవర్మతో కలిసి సత్రాజిత్తును చంపెయ్యడానికి పన్నాగము చేసి శతధన్వుని చంపమని చెప్పారు. శతధన్వుడు సత్రాజిత్తుని చంపేశాడు. శతధన్వుడు సత్త్రాజిత్తుని చంపి ఆ శమంతకమణిని అపహరించి వెళ్లి పోయాడు. సత్యభామ ఆ విషయమును తెలుసుకొని ఏడుస్తూ కృష్ణుని దగ్గరకు వెళ్లి శతధన్వుని సంహరించామని అడిగింది.

కృష్ణుడు బలరామునితో కలిసి శతధన్వుని చంపడానికి బయలుదేరారు. శతధన్వుడు అక్రూరుని మరియు కృతవర్మను తనకు సహాయముగా రమ్మని అడిగాడు. కానీ అక్రూరుడు కృష్ణునిమీద భక్తితో తాను రాను అని చెప్పాడు. శతధన్వుడు తన దగ్గర వున్న శమంతకమణిని అక్రూరునికి ఇచ్చివేసి తాను రధము ఎక్కి పారిపోయాడు. బలరామకృష్ణులు శతధన్వుని తరిమి చివరకు ద్వంద యుద్దములో కృష్ణుడు శతధన్వుని చంపేశాడు. మొత్తం వెతకగా శమంతకమణి కనపడలేదు. కృష్ణుడు బలరాముని దగ్గరకు వెళ్లి నాకు శమంతకమణి దొరకలేదు అని చెప్పాడు. కానీ బలరాముడు కృష్ణుని నమ్మలేదు. శమంతకమణిలో భాగం ఇవ్వాలని కృష్ణుడు శమంతకమణి దొరకలేదు అని అబద్దం చెప్పాడనుకొని కోపంతో బలరాముడు విదేహ రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇంతలో జాంబవతి, సత్యభామ మధ్యలో శమంతకమణి గురించి గొడవ జరిగి కృష్ణుడు దానిని దాచేసాడు అని మరొక నీలాపనింద. దానిని గురించి రాజ్యమంతా చర్చజరిగి కృష్ణుడు ఎంత టక్కరివాడో అని మరొక నీలాపనింద. ఇలా ఒక నిందను తప్పించుకుంటే పది నిందలు కృష్ణుడి మీద వచ్చి పడుతున్నాయి.

కృష్ణుడు ఒక నిమిషం ఆలోచించి ఇది కేవలము భాద్రపద శుక్ల చవితి నాడు చంద్ర దర్శనము వలెనే జరుగుతోంది అని నారద మహర్షి ద్వారా తెలుసుకున్నాడు. ఆ చంద్ర దర్శనం చేతనే ఇన్ని నీలాపనిందలు వస్తున్నాయి అని చెప్పాడు.

భాద్రపద శుక్ల చవితి విఘ్నేశ్వరుని ఆవిర్భావ తిథి. విఘ్నేశ్వరుడు అమ్మ చేసిన కుడుములు ఉండ్రాళ్ళు తిని అన్ని లోకాలు తిరుగుతూ చంద్రలోకానికి కూడా వెళ్ళాడు. అక్కడ చంద్రుడు కవుల వర్ణనతో వచ్చిన గర్వముతో అహంకారంతో ఏనుగు తలా పెద్ద బొజ్జ వున్నా విఘ్నేశ్వరుని చూసి పకపకా నవ్వాడు.విఘ్నేశ్వరుడు చంద్రుని చూసి - నీకు బాహ్య సౌందర్యము ఉంది కానీ అంతః సౌందర్యము లేదు. అందుకే ఒక సారి గురుపత్నిని చెరబట్టావు. వేరొకసారి ఇరవైఏడు మంది భార్యలలో ఒక భార్యతోనే సఖ్యముగా ఉండీ మిగతా వారిని నిర్లక్ష్యము చేసావు. నీ మామగారి శాపానికి గురిఅయ్యావు. బాహ్యములో ఎలా వున్నా అందరి విఘ్నములను తొలగించి వారికి మంచి చేసేవాడిని నేను. నీ అహంకారము పోగొట్టడానికి మాత్రమే నీకు శాపమును ఇస్తున్నాను. ఎవరైతే నిన్ను చూస్తారో వారికి నీలాపనిందలు వస్తాయి అని అక్కడినించి వెళ్ళిపోయాడు.

దానితో అందరు చంద్రుని చూడడం మానేశారు. అది చూసి చంద్రుడు అవమానంతో సముద్రములో దాక్కున్నాడు. చంద్రుడు లేని కారణంగా భూమి మీద ఓషధులు లేవు. అందరు అనారోగ్యం పాలు అవుతున్నారు. బ్రహ్మగారు దేవతలతో భద్రపడ్డా శుక్ల చతుర్థి నాడు చంద్రుని చేత విఘ్నేశ్వరుని వ్రతము చేస్తే ఆయన దీనికి ఉపసంహారం ఇవ్వగలడు అని చెప్పారు. కానీ ఈ విషయం ఎవరు చంద్రునికి చెప్పాలో అర్ధం కాలేదు. చంద్రునికి కనపడకుండా దేవతలు నీటిని అడ్డుపెట్టుకుని విఘ్నేశ్వర వ్రతమును చెయ్యమని చెప్పారు. చంద్రుడు తప్పకుండ చేస్తాను అని చెప్పి శ్రద్ధతో విగ్నేశ్వరుని వ్రతమాచరించాడు. దానికి సంతుష్టుడైన విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై తప్పు తెలుసుకున్న చంద్రుని తలమీద పెట్టుకుని నృత్యం చేసి నృత్య గణపతి అయ్యాడు. ఆ నృత్య గణపతి ఆ రోజు దేవతలకు ప్రతి నెల చతుర్థి తిధి నాడు మాత్రం చంద్రుని చూడరాను అని కొంత మేరకు శాపమును ఉపసంహారం చేసాడు. దానితో పాటు ప్రతి నెలలో చతుర్థినాడు విఘ్నేశ్వరుని పూజిస్తే సంకటములను హరిస్తాను అని తెలియచేసాడు.

ఈ వినాయక కథను నారదుడు కృష్ణునికి చెప్పి వినాయక వ్రతమును చెయ్యమని చెప్పాడు. కృష్ణుడు తప్పకుండ చేస్తాను అని ఆ వ్రతమును ఆచరించగా విగ్నేశ్వరుడు ప్రత్యక్షమై నీలాపనిందలు పోయేటట్లు అనుగ్రహించాడు. దీనితో బాటుగా ఈ శమంతకోపాఖ్యానం ఎవరైతే భాద్రపద శుక్ల చతుర్థినాడు చదువుతారో, వింటారో వారికి ఎలాంటి నీలాపనిందలు రాకుండా ఉండేటట్లు వరమిచ్చాడు.

మహాభక్తుడైన అక్రూరుడు తాను చేసినపనికి సిగ్గుపడి శమంతకముతో కాసి పట్నం వెళ్లి అక్కడ ఆ మణి ఇచ్చే బంగారముతో యజ్ఞ యాగాదులు చేస్తూ గడుపుతున్నాడు. అక్రూరునికి కబురు పంపగా అయన వడివడిగా ఆ శమంతకమణితో కృష్ణుని దగ్గరకు వచ్చి ఆ మణిని తీసుకొమ్మని చెప్పాడు. ఇది విన్న జాంబవతి సత్యభామలు తమ తప్పు తెలుసుకున్నారు. అక్రూరుని దగ్గర మణి ఉందన్న వార్త విన్న బలరాముడు తన తప్పు తెలుసుకున్నాడు. కృష్ణుడు ఆ మణిని తిరిగి అక్రూరునికి ఇచ్చి యజ్ఞయాగాదులు చెయ్యమని చెప్పి పంపాడు. అక్రూరుడు ఎన్నో మంచి పనులు చేసి చివరకు కృష్ణభగవానునిలో ఐక్యం అయిపోయాడు. ఇలా కృష్ణుని నీలాపనిందలు అన్ని పోయాయి.

ఇంతటి అద్భుతమైన శమంతకము మనల్ని రక్షించు గాక.

జై శ్రీమన్నారాయణ

Search LAtelugu