నారద పురాణము అగ్ని పురాణము, గరుడ పురాణముల వలెనె విజ్ఞానమును తెలియ చేసే పురాణము. నారద పురాణము విష్ణువు ప్రధాన దైవమని, ఆయననించే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వుద్భవించారని చెప్తుంది. నారద పురాణము ప్రతిపాదించే వైష్ణవ, శైవ, శాక్తేయ, తాంత్రిక శాఖలు అన్ని పురాణం వాఙ్మయానికి అతి ముఖ్యమైనవే.

భారతీయ తత్వ శాస్త్రములోని ఆరు అంగములను నారద పురాణము సమానముగా పరిగణించింది. ఆత్మ పరమాత్మలో ఐక్యం అయ్యే విధానమును నారద పురాణము చాల చక్కగా వివరిస్తుంది. ఆధ్యాత్మ తత్వాన్ని, మోక్ష ధర్మాన్ని అద్వితీయంగా వివరించే పురాణము నారద పురాణము.

వేదాంగాలలో నారద పురాణము శిక్షను, వైదిక సంస్కృత భాషను, సంగీతమును పలికే సూత్రాలను వివరించింది. నారద పురాణము అష్టాదశ పురాణాల విషయానుక్రమణికను చాల విపులంగా తెలియచేస్తుంది. ఇందులోని పూర్వభాగములో అనేక వ్రతములు, వాటిని ఆచరించే విధానములు, వివరములు ఇవ్వబడ్డాయి. ఉత్తర భాగంలో ఏకాదశి వ్రతమును ఉదాహరణ పూర్వకముగా వివరిస్తుంది. ఇక తీర్ధాలను, క్షత్రాలను గురించి ఈ పురాణము చాల సుదీర్ఘమైన వివరణను సమకూర్చినది. పుణ్య క్షత్రములైన గంగ, పురుషోత్తమ క్షేత్రం మొదలైన వాని మాహాత్యములని వివరించింది.

భగవద్భక్తులు అనేక రకాలు. కొందరు విష్ణువును, కొందరు శివుని, కొందరు శక్తిని... ఇలా భిన్న భిన్న వ్యక్తులు భిన్న భిన్న దేవతార్చన చేస్తూవుంటారు. అందువల్లనే పురాణములలో కూడా విష్ణుపారమ్యాన్ని, శివపారమ్యాన్ని, శక్తీ పారమ్యాన్ని తెలియచేసే పురాణములు వున్నయి. నారద పురాణము అన్ని దేవతలలో ఏకత్వాన్ని తెలియచేసి అభేద బుద్ధిని పోగొడుతుంది. నారద పురాణములో అనేక సందర్భములలో శివ విష్ణువుల ఐక్యతను బోధించిన అనేక సంఘటనలు వున్నాయి.

శివస్వరూపి శివ భక్తిభాజాం యో విష్ణుస్వరూపి హరిర్భావతానాం
శివేతి నీలకంఠేతి శంకరేతి చ యస్మరేత్
సర్వభూతో నిత్యం సోఅభ్యర్చో దివజై స్మృతీహి

దానమైన, తపస్సు అయినా, యజ్ఞమైన సంపూర్ణ భక్తి భావముతో చెయ్యాలి. అహంకారంతో ఏమి చేసినా అది ఫలించదు. భగవద్ప్రసాదం సిద్దించాలంటే భక్తి అనే సాధనము చాల ముఖ్యము అని నారద పురాణము తెలియచేస్తుంది.

ఎవనికి భగవంతుని పట్ల భక్తి భావము ఉంటుందో అతడే లోకంలో ధన్యుడు. భగవంతుని పట్ల వినమ్ర భావము ఒక్కటి ఉంటే మిగిలిన సద్గుణములన్ని వర్తిస్తాయి. వేద విహితములైన ధర్మములను ఆచరించుచు భగవద్ధ్యాన పరుడైనవాడు పరమపదమును పొందుతాడు అని నారద పురాణము తెలియచేస్తుంది. ఆచారము నుండి ధర్మము పుడుతుంది. ఆ ధర్మమునకు అధిపతి శ్రీమన్నారాయణుడు.

రాజ ధర్మములను గురించి కూడా ఈ పురాణము చాల విషయములని తెలియ చేస్తుంది. ప్రజా రక్షణ, శత్రు సంహారము, న్యాయముతో కూడిన విధానంతో పన్ను వాసులు చెయ్యడము, మృదు భాషణము, గోరక్షణ తత్పరత, తిండి బట్ట నివాసము అనే కనీస సౌకర్యములను ప్రజలకు చేకూర్చడం ఇలా చాల ధర్మములు చెప్పబడ్డాయి.

పాప కర్మలు పది రకాలు అని నారద పురాణము తెలియచేస్తుంది. దౌర్జన్యముతో వస్తువులను తీసుకొనడం, ఇతరులను హింసించటం, పరస్త్రీలను అనుభవించడం, కఠినంగా మాట్లాడడం, అబద్ధములు ఆడడము, చాడీలు చెప్పడము, అసంబద్ధ ప్రలాపము, దొంగతనము, ఇతరులకు చెడు జరగాలని కోరుకోవడం మరియు పనికి రాణి విషయాలలో పట్టుదల ఉండడం.

ఈ పాపాలు నశించాలంటే ఆ శ్రీమన్నారాయణుని వేడుకోవాలి. మన ఈ పాపాలను ఆ స్వామి హరిస్తాడు కాబట్టి ఆయనకు దశహర అని నామము.

జై శ్రీమన్నారాయణ

Comments  

0 #1 Very rare article, Thanks Gurujipratap 2017-07-31 14:29
Naradha puranam one note great enlightenment from astadasha puranas..
Quote

Add comment


Security code
Refresh