1933లో పరమాచార్య స్వామివారు వారణాసిలో ఉన్నప్పటి సంఘటన. కాశి మహారాజు రాజభవనంలో మహాస్వామివారిని స్వాగతించారు. అక్కడ ఎందరో విద్వాంసులు పండితులు ఉన్నారు. అక్కడున్న కొద్దిమంది పండితులకి స్వామివారిపై కొంచం అసూయ. పరమాచార్య స్వామికి జగద్గురు బిరుదు ఎలా సంభావ్యం అన్నది వారి కడుపుమంట.

అక్కడున్న వారిలో ఒక పండితుడు, “ఈ జగద్గురువు ఎవరు?” అని అడిగాడు. స్వామివారు మర్యాదతో, “నేనే” అని సమాధానమిచ్చారు. ఆ పండితుడు వ్యంగంగా “తమరు జగద్గురువు” అన్నాడు.

అందుకు స్వామివారు “जगतां गुरुः न – నేను జగద్గురువు అని అంటే దాని అర్థం నేను ఈ జగత్తుకు గురువు అని కాదు అర్థం.

जगति पद्यमनाः सर्वे मम गुरवः - విశ్వాంలోని అన్ని ప్రాణులు నాకు గురువులు అని అర్థం” అని చెప్పారు.

ఇలా చెప్పగానే అక్కడున్న పండితులందరూ ఆశ్చర్యంతో వెనక్కు తగ్గారు. కాని మహాస్వామివారు అంతటితో ఆపలేదు.

ఈ వాదం జరుగుతున్న మందిరంలో పిచుకలు పెట్టిన కొన్ని గూళ్ళు ఉన్నాయి. స్వామివారు ఒక గూటివైపు చెయ్యి చూపిస్తూ, ఆ పండితులను అడిగారు, “किं इदं? - ఏమిటిది?”

అందుకు ఆ పండితులు, “नीडः - గూడు” అని చెప్పారు.

మహాస్వామివారు “केन निर्मितं? – ఎవరు కట్టారు?” అని అడిగారు.

వారు “चटकैः – పిచుకలు” అని చెప్పారు.

స్వామి వారితో, “ఈ గూడు కట్టినది కాళ్ళు చేతులు లేని ఆ చిన్ని పక్షులు. మనకు కాళ్ళు, చేతులు ఉన్నాయి. కాని కాని మనం వాటిలా గూడు కట్టలేము. ఆ పిచుకలకు ‘క్రియా శక్తి’ ఉంది. నాకు ఆ శక్తి లేదు”

కాబట్టి ఆ పిచుకలు నాకు ‘గురువు’ అని చెప్పారు!!!

Search LAtelugu