భగవంతుడు దయతో మనల్ని ఉద్దరించడానికి అవతారస్వీకారం చేస్తాడు. అంతటా ఉన్నటువంటి భగవంతుడు అవతారము ఎందుకు తీసుకోవాలి? మాంస నేత్రమునకు దొరకక కేవలము జ్ఞానము చేత అనుభవములోనికి వచ్చేటటువంటి తత్వము భగవద్ తత్వము. భగవంతుడు ఎక్కడ లేదు? అన్ని చోట్ల వున్నాడు. అంతటా వున్నాడు. అణువు అణువులోను భగవంతుడు వున్నాడు. అంతటా తానై వున్నాడు. అలంటి భగవంతునికి మరొక స్వరూపము తీసుకోవలసిన అవసరము అసలు లేదు. కేవలం మనుష్యుల ఉద్దరణ కొరకు మాత్రమే ఆయన ఈ కన్నులకు కనపడే మాంసనేత్రమును తీసుకోవలసి వచ్చింది.

హరి మయము విశ్వమంతయు | హరి విశ్వమయుండు |
హరి మయము కానీ ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావని వింటే |

Обувь

అసలు విష్ణువు తప్ప వేరొకటి లేదు. అంత ఆయనే. కానీ ఈ నామ రూపాలుగా కనపడడమే మాయ. వున్నది బంగారమే అయినా ఎన్నో నగలు. వున్నది గోధుమ పిండే అయినా ఎన్నో వంటకాలు. వున్నది మట్టే అయినా ఎన్నో ఆకృతులు. వున్నది ఆ నారాయణుడే అయినా ఎన్నో నామ రూపాలు. నామ రూపాలు కనపడి విష్ణు తత్వము కనపడకపోవడం మాయ. నామ రూపాలలో విష్ణు తత్త్వం భాసించడమే సత్యం. అనుభవంగా ఆ విష్ణుతత్వము మనకి తెలియడమే అద్వైతానుభూతి.

ఈ మాంసనేత్రమునకు కనబడే విధంగా వచ్చేటప్పుడు భగవంతుడు 6 రకాల అవతారములు తీసుకుంటాడు. ఒక్కొక్క అవతారమునకు ఒక్కొక్క ప్రయోజనము ఉంటుంది.
1. అంశావతారము
2. అంశ అంశావతారము
3. ఆవేశావతారము
4. కలావతారము
5. పూర్ణావతారము
6. పరిపూర్ణావతారము

1. అంశావతారము - వున్నది ఒక్క తత్వమే. ఆ తత్వము సృష్టి చేసేటప్పుడు భ్రహ్మగా, నిర్వహణ చేసేటప్పుడు విష్ణువుగా, లయకారకుడు రుద్రుడిలా, కేవలము కారుణ్యముతో చేస్తాడు. ఈ మూడు పనులు చేసేటప్పుడు భగవంతునికి క్రౌర్యము ఉండదు. ఒక ఆత్మ ఒక శరీరమును పొందితే, పుణ్యము చేసుకోవచ్చు. శాస్త్రములు చదువుకోవచ్చు. ఒక గురువును పట్టుకుని ఆత్మ సాక్షాత్కారము పొందవచ్చు. ఉత్తమమైనటువంటి కర్మలు చేసి జ్ఞానమును పొందుతాడు. కేవలం దయతోనే బ్రహ్మగారు ఈ సృష్టి చేసి ఆత్మోద్ధరణ చేసుకునే అవకాశమును కల్పిస్తాడు. అజ్ఞానము పోగొట్టి జ్ఞానము కలుగచేసి ఈ శరీరమును నిలబెడతాడు విష్ణువు. అది కూడా కేవలం కారుణ్యముతోనే. లయకారకుడైన హరుడు అజ్ఞానము నిర్మూలిస్తాడు. అందుకే ఆయనను "జ్ఞాన దాత మహేశ్వరః" అని అంటారు. అలాంటి భగవంతుడు మూడుగా కనపడి మూడు పనిచేస్తున్నట్లుగా ఉండడమే అంశావతారము అంటారు. నిజానికి ఈ ముగ్గురు అన్ని పనులు చేస్తూవుంటారు. విష్ణువు సంహరణ చేసినప్పుడు హరుడు. శివుడు సృష్టి చేసినప్పుడు బ్రహ్మ. ఎవరో తపస్సు చేసి కోర్కెలు కోరితే బ్రహ్మగారు విష్ణువై అనుగ్రహిస్తారు. ఇలా ముగ్గురు అన్ని పనులు చేస్తూవుంటారు. ఒక పరబ్రహ్మ తత్వము మూడుగా కనపడితే అదే అంశావతారము.

2. అంశ అంశావతారము - అంశావతారము నుండి అంశఅంశావతారము వస్తుంది. బ్రహ్మగారు సృష్టి చెయ్యవలసి వచ్చినప్పుడు ప్రజాపతులను పిలిచి వారిని సృష్టి చెయ్యమని చెప్తారు. అందుకే కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి, మరీచి లాంటి వారు సృష్టి చేస్తారు. భాగవతంలో ఈ విషయమై చాలా వివరముగా ఉంటుంది. ఒక్కొక్క ప్రజాపతినుండి అనేక జాతులు వస్తాయి. అనేక జీవరాసులు ఈ ప్రజాపతులనుంచే వస్తాయి. ఇలా ప్రజాపతులు సృష్టి చేస్తే దీనిని అంశ అంశావతారము అని పిలుస్తారు.

3. ఆవేశావతారము - ఒక్కొక్కప్పుడు భగవంతుని ఆవేశము పరిపూర్ణముగా వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనమును పూర్తి చేస్తుంది. ఉదాహరణకు పరశురాముడు, నరసింహావతారము. పరశురాముడు క్షత్రియ జాతినంతటిని నిర్మూలించేసాడు. శమంతక పంచకమును ఏర్పాటు చేసాడు. ఆలా గండ్ర గొడ్డలి పట్టుకుని వచ్చి ఆయన చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి పని చేసే అవతారాములకు ఆవేశావతారములని పేరు.

4. కలావతారము - ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు ధర్మాన్ని పట్టుకుని ప్రయోజనం పొందటానికి కావలసిన వాఙ్మయమును, అనుష్టించవలసిన పనులను తెలియచేయడానికి పరమేశ్వరుడు జ్ఞాన మూర్తిగా కేవలం జ్ఞానప్రభోదం చెయ్యడానికి అవతారము స్వీకరిస్తే అదే కలావతారము. వేదముయొక్క ప్రమాణము చాటి చెప్పడానికి వేదము లోకములలో వ్యాప్తి చెయ్యడానికి, జ్ఞానమును ప్రభోధించడానికి, వేదమార్గములో భగవంతుని ఎలా చెరుకోవాలో తెలియచేయడానికి భగవంతుడు వ్యాసుని రూపములో, శంకర భగవాడపాదుల రూపములో, శ్రీ రామానుజుల రూపములో ఒక గురువుగా ఒక మార్గదర్శిగా అవతరించి మనల్ని కాపాడుతాడు. ఈ అవతారంలో భగవంతుడు సంహార ప్రక్రియ చెయ్యడు.

5. పూర్ణావతారము - ఈ అవతారంలో నవరసములు ఉంటాయి. విశేషమైనటువంటి బహు పరాక్రమము, దేశ కాలములతో సంబంధము లేకుండా ఎప్పుడు పూజింప దగినటువంటి సాకార యోగ్యతా కలిగినటువంటి అవతారం పూర్ణావతారము. ఉదాహరణకి శ్రీ రామావతారము. లోక రక్షణ హేతువై ధర్మ సంస్థాపనే ధ్యేయముగా వచ్చినటువంటి అవతారము శ్రీ రామావతారము. ఏ సందర్భములో ధర్మమును ఈ విధంగా పట్టుకోవాలి అని తెలుసుకోడానికి వేదం దాకా వెళ్ళకుండా శ్రీ రామాయణం చదువుకుంటే చాలు. మనకి సమాధానం దొరుకుతుంది. సీతా రాములు ఎం చేశారో మనం కూడా అదే చేస్తే చాలు. చంద్రశేఖరేంద్ర మహా స్వామి పాఠశాలకు వెళ్ళినప్పుడు రామనామము పిల్లల చేత రాయించేవారు.

6 పరిపూర్ణావతారము - అన్ని అవతారములు కలిసిపోయే అవతారము పరిపూర్ణావతారం. ఆ అవతారంలో చెప్పిన ప్రతి విషయం ఆచరణ యోగ్యము. భగవంతునికి ఈ అవతారంలో తెలియని విషము ఉండదు. కృష్ణావతారము దీనికి ఉదాహరణ. ఈ అవతారంలో చెప్పే ప్రతీ విషయం ఆచరణలో పెట్టాలి. మాయను, అజ్ఞానమును పోగొట్టి మనల్ని భగవంతుని వైపు తీసుకుని వెళ్ళడానికి కారణమైన విషయసంగ్రహము మనకి భగవద్గితలా శ్రీ కృష్ణ పరమాత్ముడు అందించాడు.

Search LAtelugu