నెయ్యి కరిగివున్నప్పుడు ఒక రంగు ఉండదు ఒక రూపము ఉండదు. అదే నెయ్యికి చల్లని గాలి తగిలితే వెంటనే అది ఘనీభవిస్తుంది. ఘనీభవినిచ్చి ఒక ముద్దలా తయారు అవుతుంది. ముద్దాలా ఉన్నటువంటి నేతిని మనము చేతితో ముట్టుకోవచ్చు. ఆ ముద్దలా వున్న నేతికి ఒక రూపం ఉంటుంది ఒక రంగు ఉంటుంది. కరిగినటువంటి నెయ్యి చల్లటి గాలికి పేరుకున్నట్టే భగవంతుని నిర్గుణమైనటువంటి స్వరూపము భక్తుల యొక్క ఆర్తికి, భక్తి అనే చల్లతనం తగిలి ఈ కంటితొ చూడడానికి వీలైనటువంటి సాకార రూపమును పొందుతుంది.

adidas

అంతటా నిండి నిమిడీకృతమైనటువంటి పరమాత్మ ఒక అవతారమును దాల్చాలి అంటే ముందు ఒక స్తోత్రము ఉంటుంది. ఒక ప్రార్ధన ఉంటుంది. దేవతలో, ఋషులో, భక్తులో ఎవరో ఒకరు ప్రార్ధన చేస్తారు. ఆ ప్రార్ధనను మన్నించి భగవంతుడు ఒక రూపాన్ని పొందుతాడు.

అందుకే వేదం "అజాయమానో బాహుదావిజాయతే" అంటుంది. ఇన్ని రూపాలు ఎందుకు? సనాతన ధర్మంలో ఇన్ని దేవుళ్ళు ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం చాల చిన్నది. నీకు ఎన్ని కస్టాలు ఉన్నాయో అన్ని భగవద్రూపాలు ఉంటాయి, ఒక్కక్కడికి ఒక్కక్క కష్టం వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంలో ఈశ్వరుడు రావలి అని అడిగాడు. అడిగిన ప్రతిసారి ఆ రూపంలో ఈశ్వరుడు వచ్చి కాపాడాడు.

చెయ్యగలిగిన నేర్పరితనం ఉండాలి కానీ ఒక్క కొయ్య దుంగతో రాముని విగ్రహము చెక్కవొచ్చు, కృష్ణుని విగ్రహము చెక్కవొచ్చు. అదే కొయ్య దుంగలొనించి ఏమి కావాలో అది తయారు చెయ్యవచ్చు. ఏనుగులు, గుర్రాలు, బొమ్మలు మరెన్నో... వీటన్నిటిని చూసి అందరం ఇది గుఱ్ఱము, ఇది ఏనుగు, ఇది కృష్ణుడు, ఇది రాముడు అని చెప్తాము కానీ వున్నది కొయ్య. కొయ్యని ఇన్ని రూపములుగా మార్చిన కమ్మరివాడిలా, మట్టిని ఎన్నో రూపాలుగా మార్చిన కుమ్మరివాడిలా, ఈశ్వరుడు ప్రసన్నుడైతే భక్తులయొక్క భక్తి అనే చల్లతనం ఆయనకి తగిలితే ఘనీభవించి భగవంతుడు ఒక రూపమును పొందుతాడు.

ఇందు గలడందు లేడని సందేహంబువలదు. చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెదకి చూడ అందందే గలడు.

అదే భగవంతుడు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగాను, స్థితి కారకుడు విష్ణువుగాను, లయ కారకుడు రుద్రిడిగాను, విఘ్నోపశాంతికి విఘ్నేశ్వరుడిగాను, భండాసురుని సంహరించుటకు లలితా పరాభట్టారికగా ఇలా ఒక్కొక్క పనికి ఒక్కొక్క అవతారమును ధరించి మనల్ని కాపాడుతూనేవుంటాడు.

ఎవనివల్ల ఈ జగములన్ని జనించినవో, ఎవని వల్ల పెరిగి నశించుచున్నవో, ఎవరు ఈ సమస్త సృష్టికి ప్రభువో, ఎవరు అన్నిటికి మూలకారకుడో, ఎవరు ఆది మధ్యాంత రహితుడో, ఎవరు సర్వాత్మ స్వరూపుడో అలాంటి భగవంతుని నేను కాపాడగోరుచున్నాను అని ఆ గజేంద్రుడు ప్రార్ధించగా ఎలా వున్నవాడు అలానే కదిలివచ్చి కాపాడిన పరమాత్ముడు మనల్నందరిని కాపాడుగాక.

Search LAtelugu