శుక్లాం భరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

శుక్ల = తెల్లని; అంబర = వస్త్రము, ఆకాశము; ధరమ్ = ధరించినటువంటి; విష్ణుం = అంతటా ఉన్నటువంటి; శశి = చంద్రునివంటి; వర్ణం = రంగు; చతుర్భుజం = నాలుగు భుజములు కలిగినటువంటి; ప్రసన్న = నవ్వుతు, ఆనందంతో ఉన్నటువంటి; వదనం = ముఖము కలిగిన; ధ్యాయే = ధ్యానిస్తున్నాను; సర్వ = అన్ని; విఘ్న = అడ్డంకులు; ఉపశాంతయే = తొలగించు, తగ్గించు.

తెల్లని వస్త్రమును ధరించినటువంటి, అంతటా నిండి ఉన్నటువంటి, చంద్రునివంటి ప్రకాశము కలిగినటువంటి ఓ విఘ్నేశ్వర నేను నిన్ను ప్రార్ధిస్తున్నాను. నాలుగు భుజాలు కలిగినటువంటి ఓ గణాధిపతి నా అడ్డంకులను నీవు తొలగించు.

విఘ్నేశ్వరుడు మన అడ్డంకులన్నన్నింటిని తొలగించి మనకు క్షేమమును చేకూర్చ గలిగినటువంటి వాడు. ఆ గణపతి మనకి జ్ఞానమును, భక్తిని ప్రసాదించి మనకు మంచికి చెడుకు మధ్య వున్నభేదమును తెలియ చేయగలడు.

విఘ్నము అంటే మనము అనుకున్నటువంటి కార్యము చెయ్యలేక పోవడం. ఎదో ఒకటి ఆ కార్యమునకు ప్రతిబంధకంగా రావటం. మనము ఏదైతే కార్యమును సంకల్పించి ఆ కార్యము చెయ్యలేకపోతామో ఆ కార్యమునకు విఘ్నము కలిగింది అని అర్ధం. విఘ్నమును ఎందుకు కల్పిస్తాడు ఈశ్వరుడు?

పండగకు అల్లుడు కూతురు వచ్చి తిరిగి వాళ్ళ వూరు వెళ్తున్నారు. అంతలో రైలు ఆలస్యం అయ్యింది. ఇది అల్లుడికి బాధ - రేపు కార్యాలయమునకు వెళ్ళలేనేమో అని. అదే ఆలస్యం తాతగారికి ఆనందం. ఇంకా కాసేపు పిల్లలతో గడపొచ్చు అని. ఒకే విషయం ఒకరికి ఆనందాన్ని మరొకరికి బాధని కలిగించింది. రైలు ఆగడం విఘ్నమా? విఘ్నమన్న మాట అన్వయములోకి వచ్చినప్పుడు వ్యక్తి స్థాయిలోకి వస్తుంది. సమిష్టి స్థాయిలో చాల అరుదుగా అన్వయమవుతుంది.

విఘ్నము భగవంతుని శాసనముగా వస్తే దానిని ఆపడం ఎవరి తరము కాదు. అది ఈశ్వర శాసనం. ఎవరో మహాభక్తుల విషయంలో తప్ప మామూలు వాళ్లకు అది తప్పించుకోవడం సాధ్యం కాదు.

విఘ్నుము ఎందుకు వస్తుంది. విఘ్నముయొక్క ఉత్పత్తి కారణం ఎక్కడననుండి వస్తోంది అని విచారణ చెయ్యాలి. విఘ్నము మనసులోనే పుడుతుంది. మనసు ఎప్పుడు రెండిటిని చూస్తూ ఉంటుంది. అది "స్తుతి" మరియు "నింద" (కీర్తి/అపకీర్తి - సుఖం/దుఃఖం). ఇలా ఎప్పుడు ద్వందములను చూస్తూవుంటుంది మనసు.

"ప్రవేశే, నిర్గమే తధా,సంగ్రామే సర్వకార్యేచ విజ్ఞ స్తస్య నజాయతే"

ఇది ఇలా ఉంటే బావుంటుంది. ఇలా ఉంటే బావుండదు అని మనసు ప్రతి సారి చెప్తునేవుంటుంది. ఏది ఎలా వున్న నాకెందుకు అనుకుంటే ద్వందాతీతుడు అయిపోయాడు అని గుర్తు. మనిషి మోదమునకో ఖేదమునకో వసుడవుతాడు. ఈ రెండిటిలో దేనికి వశమైనా కార్యము నశిస్తుంది.

స్వామి హనుమ సుందరకాండలో సముద్రం పైన వెళ్లిపోతున్నారు. ఆలా వెళ్తున్నప్పుడు మార్గ మద్యములో మైనాక పర్వతము (హిమవంతుని కొడుకు - పార్వతి దేవి సోదరుడు) పైకి లేచింది.  హనుమని కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని వెళ్ళమని అడిగింది. అప్పుడు హనుమ మైనాకునితో - ఇది నా కార్యానికి విఘ్నము అని ఆగకుండా వెళ్లిపోయారు. ఉప్పు సముద్రములోనించి బంగారు శిఖరములు గల పర్వతము చెట్లు పళ్లతో నిండి విశ్రాంతి తీసుకో అన్నప్పుడు హనుమ మోదమునకు లొంగకుండా కార్య దీక్షతో ముందుకు వెళ్లిపోయారు. అలానే సురస వచ్చి మింగుతాను అని అన్నప్పుడుకూడా ఖేదమునను లొంగకుండా ముందుకువెళ్లిపోయారు.

"ప్రహరిష్ట వదనః శ్రీమాన్"

మనసు యొక్క సంకల్ప వికల్పములను గెలిచినవాడు కనుక హనుమని శ్రీమాన్ అని మహర్షి అన్నారు. సంకల్ప వికల్పములను దాటగల బుద్దిని తెచ్చుకోగలిగితే అప్పుడు మన కార్యము సాఫల్యము అవుతుంది. మన బుద్ది ఎప్పుడు కార్యమునకు విఘ్నము అయ్యేటటువంటి సంకల్ప వికల్పములకు లోను కాకుండా సంకల్పిత కార్యం మీదే వుంచగలిగితే అదే సాత్వికమైనటువంటి మనస్సు.

అలాంటి బుద్ధిని మనకు ఇచ్చేటటువంటి విఘ్నేశ్వరుడు మనల్ని కాపాడుగాక.

Search LAtelugu