ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రమైన శ్రీరంగములో 14 వ శతాబ్ద ప్రారంభములో జరిగిన కధ! అక్కడ గోపాలభట్టర్ అనే వైష్ణవ భక్తుడుఒకరు నివసించేవారు! వారికి భగవద్గీత అంటే పిచ్చి! అదే ఆయన ప్రపంచం !

ప్రతిరోజు శ్రీరంగనాథుని ద్వజస్థంభము వద్ద స్థిరాసనమున గీతాపారాయణముచేయడము వారికి అలవాటు. గళమువిప్పి బిగ్గరగా వారు గీతాపారాయణము చేసేవారు. అది పండితుల చెవులలో అపభ్రంశముగా వినిపించేది. కారణము వీరు శ్లోకములను వుచ్చారణ దోషముగా పఠించడమేగాక మధ్య మధ్యలో వరుసలు వదిలివేసెడి వారు! శ్లోకపువరుసలు గతి తప్పవు !

పలువురు దర్శించుకొనే ఆలయములో ఇలా భగవద్గీత తప్పులు తడకలుగా పారాయణము చేయడము ఎవరు సహించగలరు? వివరణ తెలిసిన పండితులు కొందరు వీరివద్దకేగి అలా తప్పులుగా చదవడము దోషమని వారిని వారించ ప్రయత్నము చేసారు.

పరమాత్మ కొరకే తాను ఆ పారాయణము చేస్తున్నానని, అది తన కర్తవ్యమనీ దానిని మానడము తన తరము కాదని గోపాలభట్టర్ కచ్చితముగా చెప్పేవారు. చాలా మంది ఎగతాళి చేసేవారు. ఆయనను అపహాస్యము చేసేవారు! వారిమీద రాళ్ళు రువ్వెవారు. గోపాలభట్టర్ ఇవేవీ పట్టించుకొనే వారు కాదు. ఎవరు ఏమి చేసినా నిర్వికారముగా పరుండిన రంగనాథుడిలా గోపాలభట్టర్ వదలక పారాయణము చేసేవారు.

ఒకసారి శ్రీకృష్ణ చైతన్య మహా ప్రభు శ్రీరంగమునకు విజయము చేయ బోతున్నారని తెలిసింది. శ్రీకృష్ణభగవానుడే భక్తి , ప్రేమ తత్వాలను , బోధించుటకై చైతన్య ప్రభువులా అవతరించి నామ సంకీర్తనపు మహిమలను బోధిస్తున్నారు. ఆ మహానుభావులు శ్రీరంగానికి విచ్చేయనున్నందున నగరమే వారిని ఆహ్వానించుటకై ,ఉత్సవవాతావరణము సంతరించుకొని యున్నది.

అప్పుడు ఆలయ అర్చకులకు ( భట్టరులకు) సంప్రదాయ పరులైన పండితులకు గోపాలభట్టరు విషయము ఙ్ఞాపకము వచ్చి వచ్చింది. కాని గోపాల్ భట్టరో ఇవేవీ పట్టించుకోకుండా తన మానాన తాను పారాయణము కొనసాగిస్తూ వచ్చారు.

ఆలయ నిర్వాహకులు వారి వద్దకు వెళ్ళి , మన ఆలయానికి ఒక పెద్ద భక్తుడు రాబోతున్నాడని అందుకని రేపు ఒక్కరోజు పారాయణను ఆపమని బ్రతిమిలాడారు. గోపాలభట్టరుకు ఇవేమీ వినిపించలేదు.తన మానాన తాను పారాయణ కొనసాగించారు. వారి చెవులలో వీరి మాటలేవీ వినబడలేదు.

భట్టరును బాగా ఎరిగిన వారొకరు శ్రీరంగన్ , అనే వారు ఈ ప్రశ్నకు తన వద్ద మార్గమొకటి వుందని తెలిపారు. "ఏకారణము చెప్పినా ఈ పిచ్చివాడి చెవిలో పడదు. రేపు ఒకరోజుమాత్రమూ వీరి పారాయణమును ఎవ్వరూ రాని ఉత్తర ద్వారములో వుంచుకో మంటాను." అని అన్నారు. ఆలయానికి ఆ మహానుభావుడు తూర్పువాకిలి గుండా వస్తారు కాబట్టి జనుల కోలాహలము, మేళతాళాల సందడి వుంటుంది గావున తమరి పారాయణానికి అడ్డంకిగా వుంటుంది కాబట్టి ఒక్కరోజుకి తమరి పారాయణమును , ఉత్తర ద్వారము వద్ద కొనసాగించమని చెప్పారు. గోపాల భట్టరూ స్వర్గ ద్వారము వద్ద పారాయణము చెయ్యడము అద్భుతముగా వుంటుందని భావించి సమ్మతించి తన పారాయణమును ఉత్తర ద్వారము వద్దకుమార్చారు.

మరునాడు శ్రీచైతన్య మహా ప్రభు , పూర్ణకుంభ మర్యాదలతో తూర్పు ద్వారముగుండా శ్రీరంగనాథుని ఆలయాన్ని ప్రవేశిస్తున్నారు. వున్నట్లుండి పరవశానికి లోనయిన చైతన్య మహాప్రభు , "ఇక్కడ ఎక్కడో గీతాపారాయణము వినిపిస్తున్నదే "అని తన్మయత్వముతో ఉత్తర ద్వారము వైపు పరుగు తీసారు .

అక్కడ గోపాలభట్టరు గీతా పారాయణము చేస్తున్నారు. అదివిని పారవశ్యముతో కంటనీరు నిండగా వింటూ వుండిపోయారు, మహా ప్రభు. ఆలయ నిర్వాహకులు ఆశ్చర్య పోయారు.

మేళ తాళ వేదఘోషమద్యలో వీరికి గీతాపారాయణము ఎలావినిపించింది? అని సంభరమాశ్చర్యంతో చూస్తూవుండిపోయారు. అందరి మనోభావములను తన సంకల్పముతో తెలిసిన మహాప్రభు వారికి ఙ్ఞాన నేత్రము తెరవబడాలనే ఆశతో , గోపాల భట్టరుని చూసి అడిగారు ---

"అయ్యా ! ఇంత భక్తిశ్రద్దలతో పారాయణ చేస్తున్నారు. సంస్కృతమును , అభ్యసించి వాక్సుద్దితో , తప్పులు లేకుండా పారాయణము చేస్తే పోలేదా, " అని అడిగారు!

దానికి గోపాల భట్టరు---"ప్రభు! సాక్షత్ కృష్ణపరమాత్మే నా ఎదుట నిలబడి అడుగుతున్నట్లు , అని పిస్తున్నది. మీకు తెలియదా! నా జీవిత కాలములో భగవద్గీతమొత్తము మనఃపాఠముగా నేర్వాలని నేను శ్రీరంగనాథుని ముందు తీసుకెన్న వ్రతము. కాని ఎప్పుడంతా నేను పారాయణము చేయ పుటలను తిప్పు తానో మొదలుపెడతానో, తిప్పుతానో, అప్పుడంతా అక్కడ భగవాన్ శ్రీకృష్ణుని , రూపము , - వారి వద్ద నిలబడిన అర్జునుడు- ఆంజనేయ ధ్వజము కలిగిన రథము ఇవియే కనబడుతుంది. మధ్య మధ్యలో కనిపించు గీతా అక్షరములను కూడుకొని పారాయణము చేస్తున్నాను". అని చెప్తూ,

ఒక్కొక్కరోజు ఆ దృశ్యం ఇటూ అటూ జరిగినప్పుడు కనబడే అక్షరాలను కూడబల్కుకొనే ప్రయత్నము చేస్తున్నాను. తన నోటిలో భువనాంతరాలనూ దర్శింపచేసిన ఆ మాయా వి - కృష్ణపరమాత్మ ఈపుటలలో తన్ను చూపించి ఏమారుస్తున్నాడే తప్ప , ఆయన వుపదేశములను , నేను తెలుకొనే అనుమతి , ఇవ్వడము లేదు. " అని చెప్పగానే , మహాప్రభు ఆయనని ప్రేమతో కౌగలించుకొన్నారు. ఇద్దరి నయనాలు చెరువులయ్యాయి.

తెలియనివారు తెలుసుకొన్నారు. తెలిసిన వారు ఆనందించారు.

ఎవరైతే శ్రీమద్ భగవద్గీతలో కృష్ణపరమాత్మనే దర్శిస్తారో, వారే భగవద్గీత పారాయణకు అర్హులు! అనే తత్వాన్ని వివరించి చెప్పారు మహాప్రభు

Search LAtelugu