ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, ఈ మూడు వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. గాయత్రీ ఉపదేశంతో ఈ మూడు వేదములు చదువవచ్చు. అధర్వ వేదం చదవడానికి మరల ఉపనయనం చేసుకొని, బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రయీవేద్యం అంటారు.

ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా మూడు వేదములను పెడితే ఈ మూడు వేదములలో మధ్యలో వున్నది యజుర్వేదము. యజుర్వేదమునకు ఏడు కాండలు ఉన్నాయి. మరల యిందులో మధ్యప్రాకారము నాల్గవ కాండ. ముందు మూడు, వెనుక మూడు ఉండగా, మధ్యలో నాల్గవది వుంది. ఈ నాల్గవ కాండలో రుద్రాధ్యాయం ఉంది. రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకమును మీరు చదివినట్లయితే -

నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ

నమశ్శంజ్గాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హన్త్రే చ హనీయ సే చ

నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమ స్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ

నమశ్శంకరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శ్శివతరాయచ!!( శ్రీ రుద్రాధ్యాయం - అష్టమానువాకం-1 - 11)

అష్టమానువాకం చివరి పాదంలో 'నమశ్శివాయ చ' అనే పదమును పెట్టారు. ఈ నమశ్శివాయ చ' ముందు 'మయస్కరాయ చ ' అని ఉంచారు. 'మయస్కరాయ చ' అంటే గురువు. గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి.

ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైతసిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదూ మరెవరో కాదు, సాక్షాత్తు శంకరుడే! ఈ విషయం రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉన్నది. 'నమః కపర్దినే చ వ్యుప్త కేశాయ చ' అని. 'కపర్దినే చ' అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. 'వ్యుప్తకేశాయ చ' అంటే అసలు వెంట్రుకలు లేని వాడు. మొత్తం పూర్ణ ముండనం చేయించుకొని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుంది? పక్కనే వున్నా నామంలో పెద్ద జటాజూటం వున్నట్లు చెప్పబడింది. ఆ పక్కనే వున్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో వున్నవాడు. ఈ రెండూ ఎలా సమన్వయము అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడయినా చెప్పారా? దీనికి వ్యాసభగవానుడు వాయుపురాణంలో 'శివుడు గుండుతో ఉన్నాడు' అని చెప్పారు. మరి గుండుతో శివుడు ఎక్కడ వున్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు. పూర్ణ ముండనం చేయించుకున్న శివ స్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయు పురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు -

'చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి'

నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో వుండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు' అని చెప్పబడింది. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయపు బట్ట గుండు మీద వేసుకొని, చేతిలో వేదములు పట్టుకొని యిలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామి వారు.

నమః కపర్దినే చ - పరమశివుడు. వ్యుప్తకేశాయ చ - శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు మరెవరో కాదు పరమశివుడే! ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రాధ్యాయం చెప్పింది. ఆయనను మయస్కరాయ చ - ఆ శంకరుల గురుపరంపర ఉన్నదే అది -సదాశివ సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం!

అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!!

ఆనాడు శంకరుడు కపర్ది అని యింత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమయిన ఈ గురుపరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురుపరంపరే నడుస్తున్నది.

ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణమును చెడగొట్టడానికి అవైదికమైన వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి, అవతార స్వీకారం చేసారు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్రచారమును చేశారు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా భాసిల్లుతున్నది. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ తత్త్వం. అదే ఒకనాడు కృష్ణుడిగా భాసించింది. అటువంటి భగవద్గీతను యిచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం, ఎందుకో కలియుగంలో వచ్చే ప్రమాదములనుండి ఉద్ధరించ గలిగినంత జ్ఞానబోధ చెయ్యలేదు? దానికి ఒక్కటే కారణం. ద్వాపరయుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసే వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది.

కృష్ణావతార ప్రారంభం నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు. పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్షసులను చంపాడు. జరాసంధాది రాక్షసులనందరిని ముందరే చంపి ఉండకపోతే, కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబదగలరా! అవతారంలో వున్నా తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాజ్ఞ్మయమును భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోలేదు.

కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగము. కలిపురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకోనడానికి ప్రయత్నించాలి. దానికి ప్రస్థానత్రయభాష్యంతో మొదలుపెట్టి, ఈశ్వరుడిని స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాజ్ఞ్మయమును జ్ఞానబోధ తప్ప యింకొక ప్రయత్నమూ కాని, పని కాని పెట్టుకోకుండా, ముప్పది రెండేళ్ళ జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్రభాష్యము వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యుల వారు. వారి పేరు చెబితే చాలు, మన పాపములు పటాపంచలు అయిపోతాయి.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!

నమామి భగవత్పాద శంకరం లోకశంకరం!!

అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమిమీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు. శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం – యివన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, గొప్ప శుభం, భద్రం, శ్రేయం, శోభనం ఇంక ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద నడయాడినాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు గురురూపంలో నడయాడుతున్నాడు. కాబట్టి మనం గురురూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూ ఉండాలి.

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః!

గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!

అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడై, శోభనములు ఇచ్చేవాడై, మంగళ ప్రదుడై ఉన్నాడు. ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు, ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్త్వబోధ చేసే వాడిని తయారుచేయాలని గోవిందపదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన ఆర్షజాతి, సనాతన ధర్మము, పురాణములు ఎంత గొప్పవో, ‘శివ’ అనేమాట ఎంత గొప్పదో, ‘శివం’ అన్నమాట ఎంత భద్రమో ఎంత శ్రేయస్కరమో, దానిని గురించి వినినా, దానిని గురించి తెలుసుకున్నా ఎంత పరవశము పొందుతామో గ్రహించాము.

పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం

బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా

నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్

శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!

శివా! నీ నామము ఎల్లవేళలా ఆవశ్యకరము’ అంటారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం మనందరినీ కాపాడుగాక.

Search LAtelugu